ముగ్గురిని మింగిన అప్పులు

18 Jul, 2018 10:02 IST|Sakshi
లచ్చయ్య  (ఫైల్‌) వీరారెడ్డి (ఫైల్‌)

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మంగళవారం అప్పుల బాధతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలకు చెందిన రైతు చీకోటి లచ్చయ్య(52) పురుగుల మందుతాగాడు. మానకొండూర్‌ మండలం కొండపల్కలకు చెందిన  వీరారెడ్డి(45) ఉరివేసుకున్నాడు.  వరంగల్‌రూరల్‌ జిల్లా పరిధిలోని భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్‌కు చెందిన తాళ్లపెల్లి రాకేశ్‌(32) జమ్మికుంట రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

కోనరావుపేట(వేములవాడ): అప్పుల బాధ భరించలేక రైతు చీకోటి లచ్చయ్య(52) ఆత్మహత్య చేసుకున్నాడు. కోనరావుపేట మండలం సుద్దాల గ్రామంలో ఈఘటన చోటుచేసుకుంది. గ్రామాని కి చెందిన  చీకోటి లచ్చయ్య తనకున్న 1.5 ఎకరాల్లో పత్తి సాగు చేసుకుంటున్నాడు. పత్తి సాగులో దిగుబడి రాక నష్టాల పాలయ్యాడు. ఇటీవల కూతురు వివాహం చేశాడు. ఇందుకోసం కొంత అప్పు చేశాడు. మరికొంత అప్పు చేసి ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లాడు. అక్కడా సరైనపని లభించక రెండు నెలలకే ఇంటికి తిరిగొచ్చాడు. అన్ని అప్పులు కలిసి రూ. ఐదు లక్షల వరకు చేరాయి. వీటిని తీర్చేదారిలేదనే బెంగతో మంగళవారం తెల్లవారుజామున వ్యవసాయ క్షేత్రంలోనే క్రిమిసంహారక మందు తాగి చనిపోయాడు. మృతుడికి భార్య లక్ష్మి, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  
కొండపల్కలలో..
మానకొండూర్‌: మండలంలోని కొండపల్కల గ్రామంలో అప్పులబాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ బిల్లా కోటేశ్వర్‌ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వీరారెడ్డి(45)కి రెండెకరాల వ్యవసాయభూమి ఉంది. మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాడు.సాగు దిగుబడి సరిగా లేకపోవడంతో రూ.ఏడు లక్షల అప్పులయ్యాయి. అప్పులెలా తీరుతాయని మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పొలం వద్దకు వెళ్లాడు. అక్కడే ఉన్న కొట్టంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడే ఉన్న రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి బోరున విలపించారు. భార్య పద్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.  
రైలుకింద పడి యువకుడు..
జమ్మికుంట(హుజూరాబాద్‌): ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జమ్మికుంట రైల్వేస్టేషన్‌ శివారులో మంగళవారం వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల్‌ రైల్వే ఎస్సై జితేందర్‌రెడ్డి వివరాల ప్రకారం.. వరంగల్‌రూరల్‌ జిల్లా పరిధిలోని భీమదేవరపల్లి మండలంలోని మాణిక్యపూర్‌ గ్రామానికి చెందిన తాళ్లపెల్లి రాకేశ్‌(32) సోమవారం హుజూరాబాద్‌లోని బంధువుల ఇంటికి వచ్చాడు. రాత్రి ఇంటికి వెళ్తున్నానని అక్కడి నుంచి బయల్దేరాడు. నేరుగా జమ్మికుంట రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్తు పట్టని విధంగా శరీరం చెల్లచెదురుగా ఎగిరిపడింది. మంగళవారం రైలు పట్టాలపై మృతదేహం కన్పించడంతో రైల్వే అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలం వద్ద లభించిన సెల్‌ఫోన్‌లో వివరాలు సేకరించారు. తమకు అప్పులు ఎక్కువ ఉన్నాయని,   వేదనతోనే తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తల్లిదండ్రులు దుర్గయ్య,ఎల్లమ్మ పోలీసులకు తెలిపారు.

మరిన్ని వార్తలు