సాగు‘బడి’..సాయం  రాక

20 Dec, 2017 02:18 IST|Sakshi
రైతు భగవాన్‌రెడ్డి కుటుంబం (ఫైల్‌)

     బతుకు భారమై రైతు కుటుంబం ఆత్మహత్య 

     అప్పులు మిగిల్చిన సాగు.. నిరుద్యోగిగా మిగిలిన కొడుకు

     కుమార్తె పెళ్లి చేయలేకపోతున్నామనే ఆవేదనతో బలవన్మరణం

     తండ్రి, కుమారుడు, కుమార్తె మృతి.. కొన ఊపిరితో భార్య

     సిద్దిపేట జిల్లా తుర్కవాని కుంటలో ఘటన

సాక్షి, సిద్దిపేట: ఆరుగాలం కష్టపడినా ఆశించిన స్థాయిలో పంట చేతికి రాలేదు. రూ.లక్షలు ఖర్చు చేసి కాన్వెంట్‌లో చదివించిన కుమారుడు, కుమార్తెకు కొలువులు రాలేదు. వీటికి తోడు అప్పులు.. మరోవైపు కుమార్తెకు వివాహం చేయలేకపోతున్నామనే బాధ.. వెరిసి ఓ రైతు కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. భార్య, పిల్లలకు పురుగుల మందు ఇచ్చి.. తాను ఉరేసుకుని రైతు గుండా భగవాన్‌రెడ్డి(58) ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు ప్రేమ్‌చంద్‌రెడ్డి(25), కుమార్తె రోజా(22) మృతి చెందగా.. భార్య రాజవ్వ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. సిద్దిపేట జిల్లా తుర్కవాని కుంట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

అప్పుల సాగు.. నిరుద్యోగి కొడుకు 
భగవాన్‌రెడ్డి తన ఐదు ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ.. పిల్లలను చదివించాడు. ఈ క్రమంలో వ్యవసాయానికి, పిల్లల చదువుల కోసం చేసిన అప్పులు రూ.5 లక్షలకు మించిపోయాయి. వ్యవసాయం కలసి వస్తుందని, కొడుకుకు ఉద్యోగం వస్తుందనే ధీమాతో ఇంతకాలం నెట్టుకొచ్చాడు. అయితే వ్యవసాయంలో అప్పులే మిగిలాయి. మరోవైపు రెండేళ్ల క్రితం ఎంబీఏ పూర్తి చేసిన కొడుకు, ఏడాది క్రితం ఎంబీఏ పూర్తి చేసిన కుమార్తె.. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేదు. చేసిన అప్పులు తీరక.. కుమార్తె వివాహానికి డబ్బులు లేక.. భగవాన్‌రెడ్డి దంపతులు తీవ్ర వేదనకు గురయ్యారు. ఐదు రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి ఇంటికి వచ్చిన కుమారుడు ఉద్యోగం రాలేదని చెప్పడంతో.. ఆ రోజు నుంచి భగవాన్‌రెడ్డి తీవ్రంగా కలత చెందాడు.

నిద్ర లేపాలంటూ అన్నకు చెప్పి.. 
ఈ నేపథ్యంలో మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తాము చనిపోతే పొద్దున్నే చూసే వారు ఉండరని భావించిన భగవాన్‌రెడ్డి.. ఉదయాన్నే నిద్ర లేపేందుకు రావాలంటూ తన అన్న రాజిరెడ్డికి చెప్పాడు. సోమవారం రాత్రి ఇంట్లో ఉన్న పురుగుల మందును కుమారుడు, కుమార్తె, భార్యకు ఇచ్చి తానూ తాగాడు. కుమారుడు, కుమార్తె చనిపోగా.. భార్య అపస్మారక స్థితిలో పడిపోయింది. అప్పటికీ మెలుకువతో ఉన్న భగవాన్‌రెడ్డి.. తాను చనిపోనేమోనని ఆందోళనతో ఉరి వేసుకున్నాడు. మంగళవారం ఉదయం భగవాన్‌ రెడ్డిని నిద్ర లేపేందుకు అన్న రాజిరెడ్డి రాగా.. ముగ్గురు విగత జీవులుగా కనిపించారు. కొన ఊపిరితో ఉన్న రాజవ్వను చుట్టుపక్కల వారి సహాయంతో ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు