ముదిరిన జల వివాదం

7 Jan, 2019 09:56 IST|Sakshi
పురుగుల మందు డబ్బాలను అధికారులకు చూపుతున్న రైతులు

జూరాల వద్ద ఉద్రిక్తత

అమరచింత (కొత్తకోట): ‘తాగునీటికే దిక్కులేదు.. సాగునీళ్లెందుకు.. ఇక్కడి రైతుల ప్రయోజనాలను కాదని ఎక్కడో దూరంగా ఉన్న రైతుల పంటపొలాలకు సాగునీరును తీసుకెళ్తారా.. ఇంది ఎంతవరకు సమంజసం.. ప్రాణాలు పోయినా నీటిని విడుదల చేయనివ్వం’ అంటూ జూరాల ఎడమకాలువ వద్ద అమరచింత, ఆత్మకూర్‌ మండలాలకు చెందిన రైతులు ఆదివారం ప్రాజెక్టు ఎడమ కాల్వ వద్ద ఆందోళనకు దిగారు. శనివారం కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. నీటిని తరలించుకుపోవడానికి వచ్చిన అధికారులతో రైతులు వాదించారు. కాలువ ద్వారా స్వల్పంగా నీటిని తీసుకెళ్తామని చెప్పిన అధికారులు ఆదివారం తెల్లవారుజామునే భారీ పోలీసు బందోబస్తును పెట్టుకుని ఎడమకాలువ ద్వారా ఫుల్‌లెవల్‌ వరకు నీటిని తరలించేందుకు వచ్చారు. దీనిని గమనించిన రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.  

ఆత్మహత్య చేసుకుంటాం..
తమ ప్రాంత రైతుల ప్రయోజనాలను కాదని నీటిని తరలిస్తే ఇక్కడే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు మందు డబ్బాలు చేత బట్టుకుని అక్కడే భీష్మించి కూర్చున్నారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోపాల్‌దిన్నె రిజర్వాయర్‌ పరిధిలోని రైతులు వేరుశనగను సాగుచేశారని, వారికి సాగునీరును ఇవ్వాలని వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్‌రెడ్డి జూరాల అధికారులకు విన్నవించడంతో అధికారులు నీటి విడుదలకు పూనుకున్నారు. దీంతో గత రెండు రోజుల నుండి జూరాల ఎడమ కాలువ వద్ద నందిమళ్ల, మూళమల్ల గ్రామాలకు చెందిన రైతులు ఆందోళనకు దిగడంతో జల వివాదం ముదురుతోంది.

బందోబస్తుతో వచ్చినా భయపడం
మొదటిరోజు రైతులనుంచి అడ్డంకులు ఎదురు కా వడంతో రైతులు రెండోరోజు  జూరాల ప్రాజెక్టు వ ద్ద ఆర్‌డీఓ చంద్రారెడ్డి, డీఎస్పీ సృజనల ఆధ్వర్యం లో భారీస్థాయిలో పోలీసులను మోహరింపచేశా రు. ప్రాజెక్టు రహదారిపై ఇతరులకు ప్రవేశం లే కుండా బారీకేడ్లను వేసి జూరాల సిబ్బందితో కలి సి ప్రధాన ఎడమకాలువ రెగ్యులేటర్ల గేట్లను తెరి చారు. విషయాన్ని తెలుసుకున్న నందిమళ్ల, మూ ళమల్ల గ్రామాల రైతులు ప్రాజెక్టు కాలువ వద్దకు చేరుకుని ఆందోళనను నిర్వహించారు. పోలీసులు వెంటనే ఇక్కడి నుంచి  తప్పుకోవాలని నీటి ప్రవాహాన్ని ఆపాలని పట్టుబట్టారు. ఎమ్మెల్యే నీళ్ల నిరంజన్‌రెడ్డి జూరాలలో నీళ్లు లేకుండా కంకణం కట్టుకున్నాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఆందోళన అవసరం లేదు
రైతుల ఆవేదనను అర్థం చేసుకున్న ఆర్డీఓ చంద్రారెడ్డి ఆందోళనకారులను శాంతింపచేసే ప్రయత్నం చేశారు. ఆత్మకూర్‌ ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, పీఎసీఎస్‌ అధ్యక్షుడు గాడికృష్ణమూర్తి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్‌ హెచ్‌బీ రాజేందర్‌సింగ్, టీఆర్‌ఎస్‌ ఆత్మకూర్, అమరచింత మండలాల అధ్యక్షుడు రవికుమార్‌ యాదవ్, ఎస్‌ఎ.రాజు రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం జూరాలలో నాలుగున్నర టీఎంసీల నీరు నిల్వ ఉందని, కేవలం తాగునీటి ప్రయోజనాలకే ఉపయోగపడాలని అధికారులకు చెప్పడంతో వెనుదిరిగారు. అంతా అయిపోయిందని ఆందోళనకు వచ్చిన రైతులు కూడా ప్రాజెక్టును వదిలివెళ్లారు. ఆకస్మికంగా పోలీసు బందోబస్తును వెంట పెట్టుకుని వచ్చిన ఆర్‌డీఓ చంద్రారెడ్డి, ఈఈ. శ్రీధర్‌ లు పోలీసుల సహకారంతో అక్కడే ఉన్న కొంతమంది రైతులను చెదరగొట్టి ఎడమ
కాల్వ ద్వారా నీటిని దిగువకు వదిలారు.  

మా నీళ్లు మాకే కావాలి
జూరాల ప్రాజెక్టులో నీటిమట్టం రోజురోజుకు పడిపోతున్నా దిగువన ఉన్న రైతుల ప్రయోజనాలకు కోసం మా తాగునీటి అవసరాలకు అడ్డంకులు సృష్టిస్తారా.. మేము ఏం పాపం చేశాం.. మా నీళ్లు మాకే కావాలని.. అంటూ మూళమల్ల, నందిమళ్ల రైతులు నిరసన వ్యక్తం చేశారు. వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్‌రెడ్డి జూరాల బ్యాక్‌వాటర్‌ను పూర్తిగా దిగువప్రాంతానికి తరలించుకపోవడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నించారు. ఆదివారం నీటిని తరలించడానికి వచ్చిన అధికారుల ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ షెట్టర్ల వద్ద అల్పాహారం తింటూ నిరసన వ్యక్తంచేశారు. ప్రాజెక్టులో నాలుగున్నర టీఎంసీల నీరే ఉందని ఇందులో కూడా రెండు టీఎంసీల మేర నీరు పూడికమట్టితో కలిసే ఉందన్నారు. మిగిలింది రెండు టీఎంసీలేనని అది కూడా మాకు దక్కకుండా చేస్తారా.. అని జూరాల ఈఈ శ్రీధర్‌ను నిలదీశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నీటిని వదలుతున్నామని.. తాగునీటిని ఎలాంటి కొరత ఉండదని హామీ ఇచ్చారు.  

మరిన్ని వార్తలు