ఇద్దరు రైతుల ఆత్మహత్య

25 Oct, 2018 12:27 IST|Sakshi
ఆత్మహత్యకు పాల్పడిన రైతు హన్మ

సాక్షి,  చేవెళ్ల: అప్పుల బాధతో వేర్దేరు చోట్ల ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. చేవెళ్ల మండంలో ఒకరు, ఆమనగల్లు మండలంలో మరొకరు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. చేవెళ్ల మండలంలోని మల్కాపూర్‌ గ్రామానికి చెందిన దేవుని శివరాజ్‌(34) తనకు  వారసత్వంగా వచ్చిన అర ఎకరం పొలంతో పాటు మరో రెండున్నర ఎకరాలను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈఏడాది టమాట, మొక్కజొన్న, పూదీన పంటలు వేశాడు. వర్షాలు సక్రమంగా లేకపోవడంతో పాటు బోరుకూడా ఎండిపోవటంతో దిగుబడి సరిగా రాలేదు.

సాగు కోసం సుమారు రూ.4లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు తీర్చే మార్గం లేక కొన్ని రోజులుగా మదనపడుతున్నాడు. మంగళవారం గ్రామ బస్‌స్టేజీ సమపంలో పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు వెంటనే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి   అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతునికి భార్య, కూతరు, కుమారుడు ఉన్నారు.  కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
  
సాకిబండ తండాలో.. 
ఆమనగల్లు: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని సాకిబండతాండాకు చెందిన రైతు నేనావత్‌ హన్మ(40) ఏడు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పత్తి, మొక్కజొన్న పంటలను సాగు చేశాడు, ఇందుకోసం దాదాపు రూ.3 లక్షలు అప్పు చేశాడు. దీంతో పాటు కూతురు పెళ్లి కోసం మరో రూ.2 లక్షలు అప్పు చేశాడు. ఈ ఏడాది పంటలు సరిగా రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన హన్మ పొలం వద్ద బుధవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య  చేసుకున్నాడు. మృతుడి భార్య దోళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఆమనగల్లు ఎస్‌ఐ మల్లీశ్వర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు