ఏమైందో... ఏమో?

9 Dec, 2017 09:17 IST|Sakshi

పార్వతీపురంలో తండ్రికొడుకుల అనుమానాస్పద మృతి

కుటుంబ కలహాలే కారణమంటున్న స్థానికులు

విషపదార్ధం తిని ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్న పోలీసులు

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ అమిత్‌ బర్దర్‌

ఆయనో రిక్షా కార్మికుడు. భార్య చనిపోయినా... కన్నకొడుకును చక్కగా పెంచాడు. శక్తిమేరకు చదివించాడు. కొడుకు అందివచ్చాక ఓ ప్రైవేటు దుకాణంలో పనిచేసుకుంటున్నాడు. ఇద్దరి సంపాదనతో ఎలాంటి అరమరికలు లేకుండా హాయిగా కాలం గడిపేస్తున్నారు. మద్యానికి బానిసైన తండ్రి వైఖరి కొడుక్కు నచ్చలేదు. ఎలాగైనా వ్యసనం మాన్పించాలని కొడుకు శతవిధాలా ప్రయత్నించాడు. వినకపోవడంతో విభేదించాడు. చివరకు ఏమైందో ఏమోగానీ... అనుమానాస్పదంగా ఇద్దరూ కన్నుమూశారు. విషాదం నింపిన ఈ సంఘటన పార్వతీపురం నందమూరి కాలనీలో శుక్రవారం చోటు చేసుకుంది.

పార్వతీపురం: పార్వతీపురం పట్టణంలోని కొత్తవలస నందమూరి కాలనీలో శుక్రవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో తండ్రి, కొడుకులు తెల్లవారేసరికి విగత జీవులై పడివుండడాన్ని చూసిన స్థానికులు, ఇరుగు పొరుగు వారు ఆందోళన చెందారు. ఏం జరిగిందో ఏమోగానీ... తండ్రి ముగడ శ్రీను(45) ఇంట్లోనే మరణించగా... కుమారుడు రాము(19) అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన చుట్టుపక్కలవారు 108కు సమాచారం అందించారు. వారు వచ్చి పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా కన్నుమూశాడు.

కుటుంబ కలహాలే కారణమా...
రిక్షా కార్మికుడైన శ్రీను కుమారుడితో కలసి 1987 నుంచి నందమూరి కాలనీలోనే నివాసం ఉంటున్నారు. రాముకు ఏడేళ్ల వయసులోనే తల్లి రూప చనిపోగా.. అన్నీ తానై శ్రీను చక్కగా పెంచాడు. ప్రస్తుతం రాము పార్వతీపురం పట్టణంలోని పాలకొండ రోడ్డులో ఉన్న శివసాయి ఆటో కన్సల్టెంట్‌లో పనిచేస్తున్నాడు. శ్రీను తరచూ మద్యం సేవించి ఇంటికి వస్తుండడంతో కొడుకు అభ్యంతరం చెప్పాడు. కష్టపడి పనిచేసి తాను వస్తుంటే ఆయన మందుతాగి బాధ్యతను మరచి ప్రవర్తిస్తున్నాండూ కుమారుడు తండ్రిని మందలించేవాడని కాలనీ వాసులు చెబుతున్నారు. గడచిన నెలరోజులుగా ఈ వ్యవహారంపై తండ్రీ కొడుకులు మాట్లాడుకోలేదని చెబుతున్నారు. తండ్రి ఇంట్లో ఉంటే కుమారుడు బయట పడుకోవడం, కుమారుడు ఇంట్లో ఉంటే తండ్రి బయట పడుకోవడం చేస్తున్నారని ఇరుగు పొరుగు వారు చెబుతున్నారు. వారం రోజులుగా శ్రీను ఎక్కడికి వెళ్లాడో తెలియదని, రాము ఒక్కడే ఇంటికి వస్తున్నాడని కాలనీవాసులు తెలిపారు. గురువారం రాత్రి తం డ్రి, కొడుకులు ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారని, వంటకూడా శ్రీను చేశాడని స్థానికులు చె బుతున్నారు. వండిన వంటను తినకుండా అలానే వదిలేశారని ఏం జరిగిందో తెలి యదని తెల్లవారి లేచి చూసేసరికి ఇలాంటి ఘోరం జరిగిపోయిందని చెబుతున్నారు.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ

విషయం తెలుసుకున్న పార్వతీపురం ఏఎస్పీ అమిత్‌ బర్దార్‌ శుక్రవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తండ్రి, కొడుకుల మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇరుగు, పొరుగు వారిని విచారించారు. సంఘటన స్థలంలో మృతికి గల ఆనవాళ్లు ఏమైనా లభిస్తాయేమోనని శోధించారు. వారు నిద్రిస్తున్న మంచంపై పరచిన బొంతలు, దుప్పట్లను పరిశీలించారు. మృతుల నోటినుంచి నురగ వచ్చిందని స్థానికులు చెప్పడంతో వాటి ఆనవాళ్లకోసం కూడా పరిశీలించారు. చివరిగా మృతదేహాలను పోస్టుమార్టం కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలనుంచి కొన్ని శరీర భాగాలను సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. విష పదార్థం తీసుకున్నందునే మృతిచెంది ఉండవచ్చని భావిస్తున్నట్లు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.రాంబాబు తెలిపారు. పూర్తి ఆధారాలు లభిస్తేగాని, తండ్రి కొడుకుల మృతికి కారణం ఏమిటనేది స్పష్టం కాదు.

మరిన్ని వార్తలు