కన్నతండ్రి కర్కశత్వం

23 May, 2018 04:19 IST|Sakshi

     గర్భవతి అయిన కుమార్తెపై దాడి

     కడుపులోనే కవలలు మృతి

     ప్రాణాపాయ స్థితిలో బాధితురాలు  

మదనపల్లె క్రైం: కన్న కూతురిపై కర్కశంగా ప్రవర్తించాడు ఓ తండ్రి. తాగిన మైకంలో గర్భవతి అని కూడా చూడకుండా దాడిచేసి కొట్టాడు. దీంతో పొట్టమీద బలమైన దెబ్బ తగిలి గర్భంలోని కవల శిశువులు మృత్యువాతపడ్డారు. తిరుపతి రుయా ఆస్పత్రి వైద్యులు మంగళవారం శస్త్ర చికిత్స నిర్వహించి మృతశిశువులను బయటికి తీశారు. ఈ విషాద సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగింది. బసినికొండకు చెందిన నరసింహులు, రమణయ్య కుమార్తె లక్ష్మీదేవికి గత ఏడాది మండలంలోని ఓబులరెడ్డిపల్లె శివకుమార్‌తో వివాహం జరిగింది.

ఆమె ప్రస్తుతం గర్భవతి.  భర్త తాగుడుకు బానిసై వదిలేయడంతో పుట్టింట్లో ఉంటోంది. తాగుబోతు భర్త మరో వివాహం చేసుకుని, మొదటి భార్యను పట్టించుకోవడం మానేశాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆమెకు న్యాయం జరగలేదు. అప్పటి నుంచి తల్లిదండ్రులపైనే ఆధారపడి కాలం వెల్లదీస్తోంది. ఈ క్రమంలో వారం క్రితం ఆమె తండ్రి నరసింహులు మద్యం తాగి వచ్చి తల్లి రమణమ్మను కొడుతుండగా లక్ష్మీదేవి అడ్డుకుంది. దీంతో ఆగ్రహించిన తండ్రి గర్భిణి అని చూడకుండా పొట్టపై కొట్టడంతో అపస్మారక స్థితిలోకి చేరుకుంది. స్థానికులు బాధితురాలిని ఏరియా ఆస్పత్రికి తరలించారు.

పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తిరుపతికి రిఫర్‌ చేశారు. రుయాలో పరీక్షించిన వైద్యులు కడుపులోని కవలలు చనిపోయారని నిర్ధారించి శస్త్ర చికిత్స నిర్వహించి బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు బాధితురాలి తల్లి రమణమ్మ తెలిపింది.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా