ఏం కష్టమొచ్చిందో..?

21 Feb, 2019 08:54 IST|Sakshi
గురునాథ్, అతని భార్య రాజు, పిల్లలు రోహిత్‌కుమార్, జ్ఞానసాయి (ఫైల్‌ఫొటో)

మృత్యువుకు ఎదురెళ్లారు..

రైలు కిందపడి ఇద్దరి పిల్లలతో తండ్రి ఆత్మహత్య

కామేశ్వరిపేట వద్ద ఘటన

కొల్లవానిపేటలో విషాదం  

బిడ్డకు చిన్న రాయి తగిలి గాయమైతేనే తల్లిదండ్రులు తట్టుకోలేరు. అలాంటిది రైలు ఢీకొని చిన్నారి శరీరం ఛిద్రమైపోతుంటే ఆ తండ్రి మనసు ఎలా తట్టుకుందో..? ఓ గంట పాటు పిల్లాడు కనిపించకపోతేనే అమ్మానాన్నల ప్రాణాలు విలవిలలాడిపోతాయి. బిడ్డలు శాశ్వతంగా దూరమయ్యారని తెలిసి ఆ తల్లి మనసు ఎంత వేదన అనుభవిస్తోందో. నడక నేర్పిన నాన్నే బిడ్డలను చావు వరకు నడిపించాడు. వేలు పట్టుకుని లోకం చూపించిన తండ్రే చిన్నారులను ఈ లోకానికి శాశ్వతంగా దూరం చేశాడు. జన్మనిచ్చాననే హక్కుతోనేనేమో ఆ బుజ్జాయిల ప్రాణాలు తీసుకున్నాడు. నరసన్నపేటలో ఇద్దరు పిల్లలతో సహా తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. చూడడానికి కూడా వీల్లేకుండా మారిపోయిన చిన్నారుల మృతదేహాలు చూసి స్థానికుల కళ్లు చెమ్మగిల్లాయి.

శ్రీకాకుళం, నరసన్నపేట:    ఆ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందుల్లేవు.. ఎవరితోనూ వివాదాలు లేవు. మేమిద్దరం..మాకిద్దరు అంటూ సంతోషంతో.. సాఫీగా గడిచిపోతున్న జీవితం వారిది. భార్య ఆరోగ్యశాఖలో       ఉద్యోగి.. భర్త వ్యవసాయం చేస్తూ గ్రామంలో గౌరవంగా బతుకుతున్న కుటుంబం. ఇంతలో ఏం జరిగిందో ఏమో..ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న భర్త తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు. ముక్కుపచ్చలారని ఇద్దరి పిల్లలతో సహా వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతే..క్షణాల్లో ఆ ప్రాంతం రక్తపాతమైంది. ముగ్గురు శరీరాలు ఛిన్నాభిన్నమయ్యాయి. కనీసం గుర్తు పట్టలేనంతగా మృతదేహాలు ముక్కలై..చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ విషాద ఘటన నరసన్నపేట మండలం కామేశ్వరిపేట వద్ద బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఇదే మండలం కొల్లవానిపేటకు చెందిన బలగ గురునాథరావు (42), అతని ఇద్దరి కుమారులు రోహిత్‌కుమార్‌ (4), జ్ఞానసాయి (2) ప్రాణాలు కోల్పోయారు. 

కామేశ్వరపేట పంచాయతీ పరిధి  కొల్లవానిపేట గ్రామానికి చెందిన బలగ గురునాథరావు అతని ఇద్దరి కుమారులతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఈ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గురునాథరావు భార్య బలగ రాజు మాకివలస పీహెచ్‌సీ పరిధి మడపాంలో ఆరోగ్య కార్యకర్తగా పని చేస్తున్నారు. బుధవారం సాయంత్రం పిల్లలను షికారుకు తీసుకెళ్తానని భార్య రాజుకు గురునాథరావు చెప్పారు. దీంతో నిజమేనని నమ్మిన ఆమె సరేనంది. దీంతో పిల్లలిద్దర్నీ  ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లిన అరగంటలోనే  పలాస–విశాఖ వెళ్లే ట్రాక్‌పై గుర్తు తెలియని రైలు కింద పడిచనిపోయినట్టు అక్కడకు సమీపంపలో ఉన్న వారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బాంబులాంటి సమాచారం విన్న గురునాథం భార్య రాజు అక్కడే కుప్పకూలిపోయింది.  తల్లి నూకమ్మ తన కొడుకు ఇక లేడన్న సంగతి తెలుసుకుని గుండెలు అదిరేలారోదిస్తోంది.

గ్రామంలో విషాదఛాయలు
ఇద్దరి పిల్లలు సహా గురునాథరావు ఆత్మహత్యతో కొల్లవానిపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. వివాదరహితుడుగా పేరున్న అతను ఎందుకు ఇంతలా తెగించాడాని స్థానికులు చర్చించుకుంటున్నారు. అభం..శుభం తెలియని పిల్లలు ఏం పాపం చేశారని ..వారికి ఈ శిక్ష విధించాడని మండిపడుతున్నారు. ఏదైనా సమస్య ఉంటే తమ వారితో చర్చించి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

సంఘటనా స్థలాన్నిపరిశీలించిన రైల్వే పోలీసులు
సంఘటన స్థలాన్ని ఆమదాలవలస జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్‌ కృష్ణారావు నేతృత్వంలోని సిబ్బంది రాత్రి 10 గంటల సమయంలో పరిశీలించారు. చెల్లాచెదురుగా పడిఉన్న ఇద్దరు పిల్లలు, గుర్నాథరావు శరీర భాగాలను సేకరించి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలిస్తున్నారు.  

మరిన్ని వార్తలు