ఇంజక్షన్‌ దొరక్క మరింత విషమం..

20 Jul, 2020 07:58 IST|Sakshi

గోదావరిఖని(రామగుండం): అనారోగ్యంతో తండ్రి..కరోనాతో తనయుడు ఇద్దరు పదిరోజుల వ్యవధిలో మృతిచెందడం ఖనిలో విషాదం నింపింది. గోదావరిఖని కళ్యాణ్‌నగర్‌లో వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్న వొడ్నాల శ్రీనివాస్‌(35) అనే వ్యాపారిని కరోనా కబలించింది. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్సపొందుతున్న అతడి తండ్రి ఈ నెల 10న అనారోగ్యంతో మృతిచెందాడు. అతడి తల్లి ఆరేళ్లక్రితమే మృతిచెందింది. తండ్రి కర్మకాండ నిర్వహించాలల్సిన తనయుడు కరోనా బారినపడ్డాడు.

తండ్రి చనిపోయిన దుఖంలో ఉన్న తనయుడిని కరోనావైరస్‌ వెంటాడింది. శ్రీనివాస్‌ తండ్రి చనిపోయే ముందు నుంచి స్వల్ప జ్వరంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 15న కరోనా అనుమానంతో గోదావరిఖని ఏరియా ఆసుపత్రికి వెళ్లగా లక్షణాలు లేకుండా టెస్ట్‌ చేయలేమని చెప్పడంతో ఇంటికి తిరిగొచ్చాడు. అదేరోజు రాత్రి విపరీతమైన దగ్గుతో బాధపడ్డాడు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రయివేట్‌ ఆసుపత్రులో చేర్చుకునేందుకు నిరాకరించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రిపోర్టులు ఉంటేనే చేర్చుకుంటామని యశోద ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో చేసేదేమీ లేక వెనుతిరిగి వచ్చారు. చివరగా శుక్రవారం తెల్లవారుజామున సచివాలయం సమీపంలో ఓ ప్రయివేట్‌ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందాడు. 

ఇంజక్షన్‌ దొరక్క మరింత విషమం..
శ్రీనివాస్‌ పరిస్థితి విషమించడంతో ప్రత్యేక ఇంజక్షన్‌ వేయాలని కుటుంబసభ్యులకు వైద్యులు తెలిపారు. ఆ ఇంజక్షన్‌ ఎంఆర్‌పీ ధర రూ.46 వేలు ఉంటే బ్లాక్‌ మార్కెట్‌లో రూ.1.40 లక్షల వరకు విక్రయిస్తున్నారని అదికూడా సకాలంలో లభించలేదని పేర్కొన్నారు. డబ్బు ఇచ్చిన తర్వాత నాలుగు గంటలకు ఇంజక్షన్‌ చేతికి అందిస్తున్నారన్నారు. అయినా కష్టపడి శనివారం మధ్యాహ్నం ఇంజక్షన్‌ కొనుగోలు చేసి తీసుకువచ్చి వేయించారు. అప్పటికే పరిస్థితి విషమంగా మారడంతో మృతిచెందాడు. ఆసుపత్రిలో రూ.4లక్షల బిల్లు అయ్యిందన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.  

కడసారిచూపునకు నోచుకోని భార్యాపిల్లలు
కోవిడ్‌–19 కరోనా వైరస్‌తో మృత్యువాతపడిన శ్రీనివాస్‌ మృతదేహాన్ని కడసారి చూపునకు కూడా నోచుకోని పరిస్థితి ఏర్పడింది. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉండడంతో శవాన్ని తీ సుకెళ్లేందుకు డాక్టర్లు ఒప్పుకోలేదని కుటుంబసభ్యులు వా పోయారు. చేసేదేమీలేక జీహెచ్‌ఎంసీకి అప్పగించినట్లు పే ర్కొన్నారు. అయితే మృతుడి భార్య, పిల్లలు ఇంటివద్దే ఉండడంతో కడసారి చూపునకు నోచుకోలేకపోయారు. కుటుంబసభ్యులు విలపిస్తున్న తీరు హృదయవిదారకంగా ఉంది. పదిరోజుల కిందటే ఇంటి పెద్ద, ఆదివారం అతడి కుమారుడు మృతిచెందడం స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

మరిన్ని వార్తలు