పురుగు మందు తాగి.. కొడుక్కి పట్టించి..

20 Nov, 2019 09:17 IST|Sakshi
మృతిచెందిన శివప్రసాద్‌ (ఫైల్‌) చిన్నారి కార్తికేయ (ఫైల్‌)   

 ఓ తండ్రి ఆత్మహత్య

ఐదేళ్ల కొడుకు పరిస్థితి విషమం

సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : ఏలూరు వన్‌టౌన్‌లో ఓ తండ్రి కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలుపుకుని తాగి, దానిని తన ఐదేళ్ల కొడుకుకు తాగించి ఆత్మహత్యాయత్నం చేయటం నగరంలో కలకలం రేపింది. గమనించిన స్నేహితులు వారిద్దరినీ చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే తండ్రి మృతిచెందినట్లు నిర్ధారించారు.  చిన్నారి ఆరోగ్యస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు వన్‌టౌన్‌ ప్రాంతంలో పడమరవీధి జోగిమేడ వద్ద నివాసం ఉంటోన్న ఉప్పలపాటి శివప్రసాద్‌ (35) ఏలూరుకు చెందిన ముస్లిం యువతి హరిణిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. శివప్రసాద్‌ ముసునూరు మండలం గోపవరానికి చెందిన వ్యక్తికాగా, కొంతకాలంగా ఏలూరులోనే నివాసం ఉంటున్నాడు. వారికి ఐదేళ్ల కుమారుడు రాణాకార్తికేయ ఉన్నాడు. కుమారుడు ఏలూరు సీఆర్‌ఆర్‌ పబ్లిక్‌ స్కూల్లో ఎల్‌కేజీ చదువుతున్నట్లు చెబుతున్నారు.

శివప్రసాద్‌ ఏలూరులో వల్లభ మిల్క్‌డైరీ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నాడు. భార్య హరిణి విజయవాడ వెళ్లగా ఆకస్మికంగా మంగళవారం సాయంత్రం పురుగుల మందును కూల్‌డ్రింకులో కలిపి తాను తాగి, ఐదేళ్ల  కొడుకు కార్తికేయతో కూడా తాగించాడు. రాత్రి 7.30 గంటల సమయంలో స్నేహితులు విషయం తెలుసుకుని ఇద్దరినీ ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే శివప్రసాద్‌ మృతిచెందినట్లు ధ్రువీకరించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కుటుంబ తగాదాలా.. లేక వ్యాపార పరమైన అంశాలేవైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఆత్మహత్యయత్నంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు పోలీ సుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు