కొడుకును హత్య చేసిన తండ్రి

13 Mar, 2020 10:46 IST|Sakshi

నిత్యం తాగి వచ్చి గొడవ చేస్తున్న కుమారుడు 

డబ్బు కోసం తరచూ వేధింపులు 

తట్టుకోలేక రోకలితో మోది హత్య 

సాక్షి, నస్రుల్లాబాద్‌(బాన్సువాడ): మద్యానికి బానిసైన యువకుడు డబ్బు కోసం కుటుంబ సభ్యులను నిత్యం వేధిస్తున్నాడు.. ఎప్పటికైనా మారకపోతాడా అని ఎదురు చూసిన తండ్రి చివరకు విసిగి పోయాడు. తన పైనే దాడి చేస్తుండడంతో ఓపిక నశించిన ఆ తండ్రి రోకలి బండతో కొట్టి కుమారుడ్ని హతమార్చాడు. నస్రుల్లాబాద్‌ మండలం కామిశెట్టిపల్లి గ్రామంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ టాటాబాబు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సాయిలు కుమారుడు రొడ్డ పౌలు అలియాస్‌ సుధాకర్‌ (35) మద్యానికి బానిసయ్యాడు.

రోజూ తాగి వస్తుండడంతో భరించలేని భార్య ఐదేళ్ల క్రితమే అతడ్ని వదిలి వెళ్లి పోయింది. మరోవైపు నిత్యం మద్యం సేవించి ఇంటికి వస్తున్న సుధాకర్‌ తనకు డబ్బులు ఇవ్వాలని తండ్రితో పాటు అన్నయ్యను విసిగిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో గొడవ జరిగి, సుధాకర్‌ తన తండ్రిని గదిలో పెట్టి తీవ్రంగా కొట్టాడు. గొడవ ముదురుతుండడంతో స్థానికులు ‘100’కు ఫోన్‌ చేసి సమాచారమివ్వగా, పోలీసులు వచ్చి సర్దిచెప్పారు. అయితే, గురువారం ఉదయం సుధాకర్‌ మళ్లీ గొడవ చేయడంతో విసిగి పోయిన తండ్రి రోకలి బండతో మోదడంతో తలకు తీవ్ర గాయమైంది. ఈ ఘటనపై ఆలస్యంగా సమాచారమందుకున్న పోలీసులు అక్కడకు వెళ్లే సరికి సుధాకర్‌ రక్తపు మడుగులో కనిపించాడు. వెంటనే అతడ్ని 108 వాహనంలో బాన్సువాడ ఆస్పత్రికి తీసుకెళ్లగా, మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో సుధాకర్‌ మృతి చెందాడు. సాయిలుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు