చుట్ట కోసం తగాదా... కొడుకును చంపిన తండ్రి

2 Nov, 2019 08:31 IST|Sakshi
కొంకుదురులో సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు

చుట్ట ఇవ్వలేదన్న కోపంతో బిక్కవోలు మండలం కొంకుదురులో ఓ తండ్రి క్షణికావేశంలో తన తయుడుని హతమార్చగా.., కిర్లంపూడి మండలం ఎస్‌.తిమ్మాపురంలో మరో తండ్రి కుమారుడి వేధింపులు భరించలేక అతడిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒకే రోజు జరిగిన ఈ సంఘటనలు జిల్లాలో సంచలనమయ్యాయి. 

సాక్షి బిక్కవోలు (తూర్పుగోదావరి): ఓ చుట్ట కోసం కొడుకుతో తగాదా పెట్టుకున్న తండ్రి క్షణికావేశంలో కర్రతో తలపై మోదడంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయిన ఘటన బిక్కవోలు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామ శివారులో ఉన్న ఇటుక బట్టిలో పని చేయడానికి నాలుగు నెలల కిందట జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామానికి చెందిన పాక చంటి, అతని రెండో భార్య అర్జమ్మ వచ్చారు. గురువారం రాత్రి తండ్రి చుట్ట ఇమ్మని కొడుకుని అడిగితే ఇంట్లో బియ్యం పెట్టె మీద ఉంది తీసుకోమన్నాడు. అది కనిపించలేదు. దీంతో కొడుకు మీద కొప్పడ్డాడు. ఇలా ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగింది. దీంతో తండ్రి కోపంతో కర్ర తీసుకువచ్చి కొడుకు నాగు (24)తలపై కొట్టాడు. ఆ దెబ్బకు తల పగిలి తీవ్ర రక్త స్రావం కావడంతో స్థానికులు వెంటనే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసికెళ్లారు. అప్పటికే మృతి చెందినట్టు అక్కడి వైద్యులు తెలిపారు. ఆసుపత్రి నుంచి సమాచారం మేరకు బిక్కవోలు పోలీసులు శుక్రవారం ఉదయం అనపర్తి సీఐ ఎన్‌వీ భాస్కరరావు, ఎస్త్సె పి.వాసు, వీఆర్వో రామారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు చంటి పరారీలో ఉన్నాడని ఎస్త్సె పి.వాసు తెలిపారు.

కన్నకొడుకుపై తండ్రి హత్యాయత్నం
కిర్లంపూడి (జగ్గంపేట): కన్నకొడుకుపై తండ్రి హత్యాయత్నం చేసిన ఘటన శుక్రవారం మండలంలోని ఎస్‌ తిమ్మాపురం గ్రామంలో జరిగింది. కిర్లంపూడి ఎస్సై జి అప్పలరాజు కథనం ప్రకారం.. ఎస్‌ తిమ్మాపురం గ్రామానికి చెందిన నక్కా పెదఅప్పారావుకి నలుగురు కుమారులు ఉన్నారు. ఇతడు ప్రతినెలా వృద్ధాప్య ఫించన్‌ తీసుకుంటున్నాడు. ప్రతినెలా పెద్ద కొడుకు నక్కా పెద సత్యనారాయణ అలియాస్‌ సత్తిబాబు తండ్రి వద్ద నుంచి బలవంతంగా పింఛను డబ్బులు గుంజుకుంటున్నాడు. ఈ నెలలో అలా చేయడంతో పెదఅప్పారావు కొడుకు సత్తిబాబుపై కత్తితో దాడి చేశాడు. దీంతో అతడి ముఖంపై బలమైన గాయమవ్వడంతో ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాలుగో కుమారుడు నక్కా శివ ఫిర్యాదు మేరకు తండ్రి నక్కా పెదఅప్పారావుపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై జి.అప్పలరాజు తెలిపారు. 

మరిన్ని వార్తలు