భార్యపై అనుమానంతో బిడ్డను కడతేర్చాడు

21 Nov, 2018 13:22 IST|Sakshi
వివరాలను వెల్లడిస్తున్న ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయరెడ్డి, సీఐ అల్తాఫ్‌ హుస్సేన్‌

2015లో చోటుచేసుకున్న ఘటన

తాజాగా పోలీసుల ఎదుట లొంగిపోయిన తండ్రి

నెల్లూరు, ఆత్మకూరురూరల్‌: భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ముగ్గురు సంతానంలో చివరి బిడ్డ తన వల్ల జన్మించలేదని చెప్పేవాడు. ఈ క్రమంలో నాలుగేళ్ల కొడుకుని పథకం ప్రకారం కన్నతండ్రే హత్య చేశాడు. అందరికీ ఓ కథ చెప్పి నమ్మించాడు. అయితే మూడు సంవత్సరాల తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయి నేరాన్ని అంగీకరించాడు. ఆత్మకూరు పట్టణంలో ఉన్న పోలీసు స్టేషన్‌లో డీఎస్పీ రామాంజనేయరెడ్డి, సీఐ అల్తాఫ్‌ హుస్సేన్, ఏఎస్‌పేట ఎస్సై వీరనారాయణ మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఏఎస్‌పేట మండలం రాజవోలుకు చెందిన గంగపట్ల సురేష్‌ (37)కి జలదంకి మండలం బ్రాహ్మణక్రాకకు చెందిన మమతతో పది సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు కలిగారు. పెళ్లైన నాటినుంచి సురేష్‌కు భార్యపై అనుమానం ఉండేది. దీంతో ఆమెను నిత్యం వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో వేధింపులు తాళలేక ఆమె కొన్ని సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసుకుని మృతిచెందింది.  

బంధువుల ఎదుట నటించి..
మూడో బిడ్డ శ్రీధర్‌ (4) తన వల్ల జన్మించలేదని సురేష్‌ అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో 2015 సంవత్సరంలో రాజవోలు సమీపంలోని జామాయిల్‌ తోటలో కట్టెలు కొట్టుకువస్తానని చెప్పి శ్రీధర్‌ను తీసుకెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత బిడ్డను చేతిలో పెట్టుకుని ఇంటికి వచ్చి ఫిట్స్‌ వచ్చాయని, చనిపోయేలా ఉన్నాడంటూ బంధువుల ఎదుట బాధను నటించాడు. వారంతా ఆత్మకూరు ఆస్పత్రికి తీసుకెళ్లగా శ్రీధర్‌కు వైద్యం చేయిస్తే ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పడంతో తాను ఒక్కడే నెల్లూరుకి తీసుకెళ్లాడు. సురేష్‌ కొడుకును ఆస్పత్రికి తీసుకెళ్లకుండా కాలయాపన చేశాడు. ఈ విషయం తెలుసుకుని పలువురు ప్రశ్నించగా చెన్నైలో తన బంధువులున్నారని అక్కడ మంచి వైద్యం చేయిస్తానని చెప్పి బస్సులో వెళ్లాడు. అక్కడి ఆస్పత్రిలో కూడా బిడ్డకు ఫిట్స్‌ వచ్చిందని చెప్పాడు. వైద్యులు పరీక్షించి బిడ్డ మృతిచెందాడని నిర్ధారించిన తర్వాత మృతదేహాన్ని తీసుకుని ఇంటికొచ్చాడు. అయితే మమత బంధువులకు సురేష్‌పై అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఏఎస్‌పేట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. కాగా ఈనెల 19వ తేదీన సురేష్‌ ఆత్మకూరు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. విచారణలో అసలు నిజం బయటపెట్టాడు. కట్టెల కోసం తీసుకెళ్లిన బిడ్డ గొంతుకు టవల్‌తో మెలిపెట్టి పైకిలేపానని, కొన ఊపిరితో ఉండగా ఫిట్స్‌ వచ్చాయని అందర్నీ నమ్మించేందుకు ఇంటికి తీసుకెళ్లానని చెప్పి నేరాన్ని అంగీకరించాడు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా