మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు!

14 Jan, 2020 05:54 IST|Sakshi
హత్యకు గురైన ముక్కమ్మ

‘తూర్పు’లో తల్లిని కడతేర్చిన కుమారుడు 

తమిళనాడులో కొడుకును హతమార్చిన తండ్రి

నెల్లిపాక/సాక్షి ప్రతినిధి, చెన్నై/కలకడ (చిత్తూరు జిల్లా): తనకు మద్యం తాగడానికి డబ్బులివ్వలేదనే కోపంతో కన్నతల్లినే హత్య చేశాడో ప్రబుద్దుడు. ఆస్తి పంపకం చేసి వివాహం చేయమన్నందుకు గాను కొడుకునే హత్య చేశాడో వ్యక్తి. ఈ విషాద ఘటనలు సోమవారం జరిగాయి. తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం తోటపల్లి గ్రామానికి చెందిన బొప్పిరెడ్డి ముక్కమ్మ (80) ముక్కయ్యలకు నలుగురు మగ సంతానం కాగా వారిలో నాగులు మూడో కుమారుడు. ఇతను చెడు వ్యసనాలకు బానిసై తాగేందుకు డబ్బులు కావాలని వృద్ధులైన తల్లిదండ్రులను నిత్యం వేధిస్తున్నాడు. ఈ నెలలో వృద్ధ దంపతులు తమకు వచ్చిన వృద్ధాప్యపు పింఛనులో రూ.4 వేలను నాగులుకు ఇచ్చారు. పింఛనులో మిగిలిన డబ్బులు కూడా ఇవ్వాలంటూ తల్లి ముక్కమ్మ, తండ్రి ముక్కయ్యలను నాగులు వేధించాడు. సోమవారం ఉదయం తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తితో మంచం మీద ఉన్న తల్లి గొంతు కోసేశాడు.

రక్తపు మడుగులో విలవిల్లాడుతూ ఆమె మంచం మీదే కన్నుమూసింది. తల్లిని హత్య చేశానని అతడు స్థానికులకు చెప్పడంతో వారు నిందితుడిని బంధించి పోలీసులకు అప్పగించారు. మరో ఘటనలో, తమిళనాడులోని ధర్మపురి జిల్లా పొమ్మిడి ప్రాంతానికి చెందిన వెంకటేశన్‌ (31) సెంట్రింగ్‌ కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. తనకు ఆస్తి పంచి పెళ్లి చేయాల్సిందిగా ఆదివారం రాత్రి తన తండ్రి చిన్నైపయన్‌తో గొడవపడ్డాడు. ఆగ్రహానికి లోనైన చిన్నైపయన్‌ ఇంటిలోని దుడ్డుకర్రతో విచక్షణారహితంగా కుమారుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. వెంకటేశన్‌కు తీవ్ర రక్తస్రావమవడంతో స్పృహ తప్పిపోయాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తండ్రి చిన్నైపయన్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. వెంకటేశన్‌ నాలుగేళ్ల క్రితం యువతిని హత్య చేసిన కేసులో అరెస్టయి ఇటీవలే బెయిల్‌పై బయటికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. 

తల్లి దండించిందని కుమార్తె ఆత్మహత్య..
చిత్తూరు జిల్లా కలకడ మండలంలోని కొత్తపల్లె గ్రామానికి చెందిన ఖాదర్‌వలి కుమార్తె జరీనా (18) ఇటీవల అదే గ్రామానికి చెందిన రెడ్డిబాషాతో మాట్లాడుతుండగా గ్రామస్తులు ఈ విషయాన్ని తల్లి మహబూబ్‌బీకి చెప్పారు. ఆవేదనకు లోనైన మహబూబ్‌బీ కుమార్తెను దండించి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. మనస్తాపానికి గురైన జరీనా అదే రోజు అర్థరాత్రి ఇంట్లోని పురుగుల మందు సేవించింది. కుటుంబసభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం కలికిరి మండలం మహల్‌కు, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. జరీనా చికిత్స పొందుతూ ఆదివారం అర్థరాత్రి మృతి చెందింది.  
ఆత్మహత్య చేసుకున్న జరీనా 

మరిన్ని వార్తలు