తండ్రే కాలయముడు

4 Dec, 2018 13:12 IST|Sakshi
రక్తపు మడుగులో పడి ఉన్న కిరణ్‌ మృతదేహం తండ్రి వెంకయ్య

హతుడు దంత వైద్యుడు

మద్యం మత్తులో తల్లిదండ్రులకు చిత్ర హింసలు  

నెల్లూరు, విడవలూరు: మద్యానికి బానిసై చిత్ర హింసలకు గురి చేస్తున్నాడని కన్న కొడుకునే కడతేర్చాడు ఓ తండ్రి. ఈ ఘటన మండలంలోని చౌకచెర్లలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. చౌకచెర్ల గ్రామానికి చెందిన ఎల్లు వెంకయ్య కుమారుడు ఎల్లు కిరణ్‌ (35) దంతవైద్య నిపుణుడు. కిరణ్‌ నెల్లూరులోని బీవీనగర్‌లో సొంతగా దంద వైద్యశాలను నిర్వహిస్తున్నాడు. అయితే కిరణ్‌ నాలుగేళ్ల క్రితం కడపకు చెందిన దంత వైద్య నిపుణురాలైన ముస్లిం యువతిని మతాంతర వివాహం చేసుకున్నాడు. మొదటి నుంచి కిరణ్‌ మద్యానికి బానిస కావడంతో భార్యను కూడా శారీరకంగా మానసికంగా చిత్ర హింసలకు గురి చేసేవాడు. దీంతో భార్య రెండేళ్ల క్రితం కిరణ్‌ను వదిలేసి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది.

అప్పటి నుంచి ఒంటరిగా ఉన్న కిరణ్‌ మరింత మద్యానికి బానిసయ్యాడు. ప్రతిరోజు చౌకచెర్లలో ఉన్న తన తల్లిదండ్రులైన వెంకయ్య, లక్ష్మి వద్దకు వచ్చి వారిపై దాడి చేసి వారిని శారీరకంగా, మానసికంగా చిత్ర హింసలకు గురి చేసేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కూడా కిరణ్‌ పూటుగా మద్యం తాగి చౌకచెర్లలోని తన ఇంటికి వచ్చి  తండ్రి వెంకయ్యతో పాటు తల్లి లక్ష్మిపై దాడి చేశాడు. దీంతో సహనం కోల్పోయిన తండ్రి వెంకయ్య కొడుకు నుంచి తప్పించుకునేందుకు రోకలి బండతో కిరణ్‌పై దాడి చేశాడు. అయితే రోకలి దెబ్బ అదుపు తప్పి కిరణ్‌ తలపై బలంగా తగలడంతో కిరణ్‌ రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కోవూరు సీఐ వెంకటేశ్వర్లురెడ్డి, విడవలూరు ఎస్సై ముత్యాలరావు  ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించడంతో పాటు కిరణ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 

మరిన్ని వార్తలు