ప్రేమ పెళ్లి చేసుకుందని కుమార్తెపై..

8 Aug, 2019 07:41 IST|Sakshi

తండ్రి అరెస్టు

చెన్నై, టీ.నగర్‌: కుమార్తె ప్రేమించి పెళ్లి చేసుకుందని ఓ తండ్రి రాక్షసుడిగా మారాడు. కని పెంచిన కుమార్తెపై హత్యాయత్నం చేశాడు. అతన్ని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. మదురై జిల్లా, తిరుమంగళం సమీపం నాగయ్యపురానికి చెందిన వాలగురునాథన్‌ (55) ఎరువుల వ్యాపారి. ఇతని కుమార్తె సుష్మ (19). బీఎస్సీ మొదటి ఏడాది అర్ధంతరంగా నిలిపేసింది. పొరుగూరికి చెందిన రామర్‌ కుమారుడు శివశంకరన్‌ (23) బీఏ పట్టభద్రుడు. సుష్మ, శివశంకరన్‌ పాఠశాల స్థాయి నుంచి ప్రేమించుకుంటూ వచ్చారు.

ఇరువురూ వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో తల్లిదండ్రులు వ్యతిరేకించారు. ఇలావుండగా ఇరువురూ రెండు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. దీంతో సుష్మ తండ్రి వాలగురునాథన్‌ ఆగ్రహించాడు. ఈ క్రమంలో ప్రేమజంట నాగయ్యపురం పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. పోలీసులు ఇరు కుటుంబాల తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. సుష్మ మేజర్‌ కావడంతో ఆమెను భర్తతో పంపేందుకు సమ్మతించారు. శివశంకరన్‌ వేరే కులానికి చెందినవాడని అతన్ని ఆంగీకరించబోమని సుష్మ తల్లిదండ్రులు చెప్పారు. కొత్తదంపతులు శివశంకరన్‌ సొంతవూరైన వాళవందాన్‌పురంలో నివశిస్తూ వచ్చారు. గర్భిణి అయిన సుష్మ మంగళవారం ఉదయం భర్త శివశంకరన్‌తో తిరుమంగళం సమీపంలోగల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పరీక్షల కోసం వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న సుష్మ తండ్రి వాలగురునాథన్‌ అక్కడికి వెళ్లి కుమార్తెతో ప్రేమగా మాట్లాడుతూ కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆమె కేకలు విన్న భర్త శివశంకరన్‌ పరుగున వచ్చి కత్తి లాక్కుని భార్యను కాపాడాడు. సుష్మకు ప్రాథమిక చికిత్స చేసి తర్వాత మెరుగైన చికిత్సల కోసం తిరుమంగళం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. భర్త శివశంకరన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమంగళం పోలీసులు వాలగురునాథన్‌ను అరెస్టు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా