లే నాన్నా.. లే.. 

11 Apr, 2020 08:50 IST|Sakshi

పాల వ్యాపారి దుర్మరణం

కలిచి వేసిన కుమార్తె రోదన

సాక్షి, కొలిమిగుండ్ల: త్వరగా తిరిగి వస్తానని చెప్పి వెళ్లిన తండ్రి ఇంటి సమీపంలోనే రక్తపు మడుగులు పడి ఉండటం చూసి ఆ చిన్నారి గుండెలు బాదుకోవడం పలువురిని కంట తడిపెట్టించింది. తమను విడిచిపోయావా నాన్నా.. మాకెవరు దిక్కంటూ రోదించిన తీరు కలిచివేసింది. పెట్నికోట గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని పెట్నికోట గ్రామం గుండు మల్లేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉండే అన్నెం కృష్ణారెడ్డి(46).. గ్రామంలో రైతులతో పాలు సేకరించి కొలిమిగుండ్లలోని విజయ డెయిరీకి పోసేవాడు.

రోజు మాదిరిగానే శుక్రవారం బైక్‌పై పాలు తీసుకెళ్లి త్వరగా పోసి వస్తానని చెప్పి వెళ్లాడు. తిరిగి వచ్చే సమయంలో ఇంటికి 50 అడుగుల దూరంలో ఎరువు లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో అదుపుతప్పి ట్రాక్టర్‌ కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఇంటి సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో భార్య లక్ష్మేశ్వరి, కూతుళ్లు శివాని, మేఘన పరుగున వచ్చి బోరున విలపించారు. తండ్రి మృతదేహంపై పడి పెద్ద కూతురు ‘లే నాన్నా.. లే’ అంటూ రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ హరినాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.  

>
మరిన్ని వార్తలు