కుమారుడిని రూ.5 వేలకు విక్రయించిన తండ్రి

22 Jun, 2018 08:35 IST|Sakshi

టీ.నగర్‌: ఇంటి పనులు చేసేందుకు, మేకలు మేపేందుకు రూ.5వేలు తీసుకుని కుమారుని విక్రయించిన తండ్రిని కార్మిక సంక్షేమ శాఖ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ధర్మపురి జిల్లా మారండహల్లి సమీపంలో గల పంజిపల్లికి చెందిన గణేషన్‌కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొన్ని నెలల క్రితం అతని భార్య మృతిచెందారు. ఇతని ఏడేండ్ల కుమారుడు శబరి అదే ప్రాంతంలో గల ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతూ వచ్చారు. అతని బంధువైన వడివేలు (40) కావేరి పట్టణం సమీపంలో గల గుండలపట్టి పంచాయతీ గుట్టూరు గ్రామంలో నివసిస్తున్నారు. ఇతనికి సొంతంగా 50 మేకలు ఉన్నాయి. ఇలాఉండగా పంజిపల్లికి చెందిన గణేషన్‌ బంధువైన వడివేలు వద్ద కుటుంబ పరిస్థితులు గురించి మాట్లాడాడు. ఆ సమయంలో ఇంటి పనులు, మేకలు మేపేందుకు ఏడాదికి ఐదువేలు అందజేస్తామని కుమారుని తన వద్దకు పంపాల్సిందిగా వడివేలు చెప్పినట్లు సమాచారం.

దీంతో రూ.5వేలు తీసుకుని గణేషన్‌ కుమారుడిని విక్రయించాడు. ఆ తరువాత బాలుడు శబరి పాఠశాలకు వెళ్లకుండా వడివేలుతో వెళ్లి మేకలను మేపుతూ వస్తున్నాడు. ఆరు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ విషయం అదే ప్రాంతానికి చెందిన రెడ్‌క్రాస్‌ సొసైటీ అధ్యక్షుడు రాజేష్‌ తెలుసుకుని బాలుని వద్ద విచారణ జరిపారు. ఆ సమయంలో నగదుకోసం తనను మేకలు మేపేందుకు తండ్రి విక్రయించినట్లు తెలిపారు. దీంతో దిగ్భ్రాంతి చెందిన రాజేష్‌ పళ్లిపట్టు వీఏఓకు సమాచారం తెలిపాడు. దీనికి సంబంధించి వివరాలు అందుకున్న నేషనల్‌ చైల్డ్‌ లేబర్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ ప్రియ, కార్మిక సంక్షేమ డిప్యూటీ కమిషనర్‌ జ్ఞానవేల్‌ చైల్డ్‌ లైన్‌ ఆర్గనైజర్‌ ప్రసన్నకుమారి బాలుని రక్షించి విచారణ జరిపారు. విచారణలో బాలుడిని లీజు ప్రాతిపదికన విక్రయించినట్లు తెలిసింది. దీంతో వడివేలుపై చర్యలు తీసుకునేందుకు రూ.20వేలు అపరాధం విధించేందుకు ఆర్‌డీవో ఉత్తర్వులిచ్చారు. గణేశన్‌ వద్ద విచారణ జరుగుతోంది. బాలుడు శబరిని మళ్లీ పాఠశాలలో చేర్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు