ప్రియురాలి ఇంట్లో ఎఫ్‌బీవో ఆత్మహత్య ?

19 Oct, 2019 08:59 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ అనుమానాస్పదంగా మృతిచెందాడు.. అక్రమ సంబంధంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పట్టణంలోని వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మృతుడి భార్య జ్యోతి తెలిపిన వివరాల ప్రకారం.. బానోవత్‌ నెహ్రూ(37)తో 2013 సంవత్సరంలో వివాహమైంది. వీరు బట్టిసావర్గాం సమీపంలోని పోలీసు కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి సాయి శరణ్య, శ్రీహర్ష ఇద్దరు పిల్లలు ఉన్నాయి.

తలమడుగు మండలంలోని బరంపూర్‌లో ఎఫ్‌బీవోగా నెహ్రూ విధులు నిర్వహిస్తున్నాడు. గతేడాది ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన ఓ మహిళతో అక్రమ వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై మహిళ పోలీసు స్టేషన్‌లో పలుసార్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కుటుంబీకులు మందలించినప్పటికీ ఆయన తీరు మారలేదు. కాగా గురువారం రాత్రి 9గంటల ప్రాంతంలో పాత హౌజింగ్‌ బోర్డు కాలనీలో అద్దెకు ఉంటున్న సదరు మహిళ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయమై ఆ మహిళ పట్టణంలోని వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో సమాచారాన్ని అందజేసింది. తాను ఇంట్లో లేని సమయంలో నెహ్రూ ఉరివేసుకొని ఉన్నాడని, తలుపు తీసే సరికి ఫ్యాన్‌కు వేలాడుతూ ఉండడంతో కొడవలితో తాడును కోశానని, అప్పటికే ఆయన మృతిచెందినట్లు పోలీసులకు వివరించింది.

బంధువుల ఆందోళన..
రాత్రి 9గంటల ప్రాంతంలో అనుమానాస్పదంగా తన కుమారుడు నెహ్రూ మృతిచెందగా సమాచారం వన్‌టౌన్‌ పోలీసులు ఇవ్వలేదని మృతుని తల్లి శారద పేర్కొన్నారు. ఉదయం 9.30 గంటలకు ఈ విషయం తమకు తెలిసిందన్నారు. తాము చనిపోయిన సంఘటన స్థలానికి వెళ్లలేదని, తమకు తెలియకుండానే అక్కడినుంచి శవాన్ని పోలీసులు రిమ్స్‌కు తరలించారని అన్నారు. ఇది ఆత్మహత్య కాదని, హత్య చేశారని ఆందోళన చేపట్టారు.తలకు, మెడ చుట్టూ గాయాలు ఉన్నాయని కన్నీరు పెట్టారు. తన కుమారుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

రిమ్స్‌ మార్చురి వద్దకు ఎస్పీ వచ్చేంత వరకు శవాన్ని తీసుకువెళ్లేది  లేదని కుటుంబ సభ్యులు భీష్మించుకుకూర్చున్నారు. రిమ్స్‌ ఎదుట రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డు పొడవున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, వన్‌టౌన్, టూటౌన్‌ సీఐలు సురేష్, పోతారం శ్రీనివాస్, ట్రాఫిక్‌ సీఐ ప్రసాద్‌రావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. మృతిపై దర్యాప్తు జరిపి కేసు నిజనిజాలను బయటపెడతామని హామీ ఇచ్చారు. 

>
మరిన్ని వార్తలు