డీజీపీ ఆఫీస్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌నంటూ టోకరా!

25 Jul, 2018 13:31 IST|Sakshi
నిందితుడు అశోక్‌ (ఫైల్‌)

రూ.4 లక్షల వరకూ అప్పులు చేసి పరారైన వైనం

పోలీసుల ఎదుట బాధితుల గగ్గోలు

నిందితుడి కోసం నున్న పోలీసుల గాలింపు

అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడ సెంట్రల్‌) : నున్న రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఓ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. డీజీపీ కార్యాలయంలో తాను హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నానని చెప్పి ఓ ఇంట్లో అద్దెకు దిగి అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల నుంచి ఒకరికి తెలియకుండా ఒకరి వద్ద సుమారు రూ.4 లక్షలు అప్పులు చేసి ఓ వ్యక్తి పరారైన ఘటన నగరంలో మంగళవారం చర్చనీయాంశంగా మారింది. నున్న రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాయకాపురం ఎల్‌బీఎస్‌ నగర్‌లోని ఓ ఇంట్లో ఆర్నెలల క్రితం అశోక్‌ అనే వ్యక్తి అద్దెకు దిగాడు. తాను డీజీపీ కార్యాలయంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తానని అందరితో పరిచయం పెంచుకున్నాడు. ప్రతి రోజూ హుందాగా పోలీసుల వలె సఫారీ డ్రస్‌లు ధరించి వస్తూ, వెళ్తూ ఉండేవాడు.

ఈ క్రమంలో తనకు ప్రమోషన్‌ వచ్చిందని, రెండు నెలలుగా వేతనాలు రావడం లేదని చెప్పి వేగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వద్ద రూ.1.50 లక్షలు అప్పు తీసుకున్నాడు. అలానే చుట్టుపక్కల నివసిస్తున్న మరో ఆరుగురి వద్ద ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద దాదాపు రూ.2.50 లక్షల వరకూ అప్పులు చేశాడు. అయితే కొన్ని రోజుల నుంచి అశోక్‌ ఇంటి వద్దకు రాకుండా ఉండడం, ఫోను పని చేయకపోవడంతో అప్పులు ఇచ్చిన వారంతా ఆయన కోసం విచారణ చేస్తున్నారు. ఎక్కడా అతని ఆచూకీ లభించకపోవడం.. అసలు అతను హెడ్‌ కానిస్టేబుల్‌ కాదని తెలియడంతో బాధితులు తాము మోసపోయినట్లు గ్రహించి నున్న రూరల్‌ పోలీసులను ఆశ్రయించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఛీటింగ్‌ కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు