బావిలో పడి అత్తా కోడలు మృతి 

27 Feb, 2018 07:32 IST|Sakshi
మృతిచెందిన అత్తా కోడళ్లు

నీళ్లు తాగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడిన కోడలు

కాపాడబోయిన అత్త కూడా మృతి

జూపాడుబంగ్లా: పిల్లోడికి ఒడుగులు (సున్తీ) చేయించి ఫంక్షన్‌ పెట్టాలనుకున్నారు. ఈ ఫంక్షన్‌కు పిల్లోడి అత్తను కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో అతని తండ్రి బయలుదేరివెళ్లాడు. అతను తిరిగొచ్చేలోపే తల్లి, భార్య మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర సంఘటన జూపాడుబంగ్లాలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సలీమాబీ(52), అజీంబాష(లేట్‌) దంపతులకు వలి, చాంద్‌బాష అనే ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు వలి భార్య మైమూన్‌(24)తో కలిసి నందికొట్కూరులో నివాసముంటున్నారు.

చిన్నకుమారుడు చాంద్‌బాష జైన్‌ఇరిగేషన్‌ కంపెనీలో కారుడ్రైవర్‌గా పనిచేస్తూ తల్లితో కలిసి జూపాడుబంగ్లాలో ఉంటున్నారు. వలి తన తొమ్మిదేళ్ల కుమారుడికి ఒడుగులు (సున్తీ) చేయాలని తల్లితో చర్చించేందుకు భార్య మైమూన్‌తో కలిసి ఆదివారం జూపాడుబంగ్లాకు వచ్చారు. సోమవారం మధ్యాహ్నం తరిగోపులకు (కేసీ కాల్వ కట్ట వెంట) వెళ్లే మార్గంలోని జామతోట వద్ద ఉన్న పొలాన్ని చూసేందుకు వలి, అతని భార్య, తల్లి ముగ్గురూ వెళ్లారు. తర్వాత తాటిపాడులో ఉన్న అక్క మాసుంబీని తీసుకురావాలని తల్లి చెప్పటంతో వలి బైక్‌పై అక్కడి నుంచే బయలుదేరి వెళ్లాడు.

ఇదే సమయంలో మైమూన్‌ దాహంతో బావిలో నీటిని తాగేందుకు వెళ్లింది. ప్రమాదవశాత్తు కాలుజారి బావిలోకి పడిపోయింది. ఈత రాక మునిగిపోతుండడంతో అత్త సలీమాబీ గమనించి కోడలును రక్షించేందుకు తన చీరకొంగును అందించింది. ప్రాణభయంతో కోడలు చీరను గట్టిగా లాగటంతో ఒడ్డుపైనున్న సలీమాబీ కూడా బావిలోకి పడిపోయింది. ఈత రాకపోవటంతో ఇద్దరూ మునిగిపోయారు. తర్వాత అక్కను తీసుకుని అక్కడికి వచ్చిన వలికి తల్లి, భార్య కనిపించలేదు.

తల్లి వద్ద ఉండాల్సిన మొక్కజొన్నలు, చిక్కుడుబుడ్డల సంచులు బావిలో పడి ఉన్నాయి. దీన్ని గమనించిన వలి తల్లి, భార్య ఇద్దరూ బావిలో పడి మరణించి ఉంటారని భావించి బంధువులకు, గ్రామస్తులకు సమాచారమిచ్చారు. వారు బావిలోని నీటిని కొంతమేర మోటార్లతో తోడారు. చివరికి ఇనుప కొక్కేలను బావిలో వేసి వెతకగా వాటికి తట్టుకొని అత్తాకోడళ్ల మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. విషయం తెలుసుకున్న ఏఎస్సై శివశంకర్‌ తన సిబ్బందితో వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు