‘మహా’ ఎన్‌కౌంటర్‌.. రక్తపుటేరుగా ఇంద్రావతి

26 Apr, 2018 12:29 IST|Sakshi

నది నుంచి బయటపడ్డ రెండు మృతదేహాలు

మొత్తం 42కి చేరిన మృతదేహాల సంఖ్య

మరింత పెరిగే అవకాశం ఉందన్న అధికారులు

గడ్చిరోలి ; మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మృత దేహాలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. గడ్చిరోలి వద్ద ఇంద్రావతి నదిలో మరో రెండు మృతదేహాలను పోలీసు బలగాలు వెలికి తీశాయి. దీంతో వరుస ఎన్‌కౌంటర్‌లలో మృతుల సంఖ్య 42కి చేరింది. ఇంతకు ముందు నది నుంచి 15 మృతదేహాలను వెలికి తీయటం తెలిసిందే. 

తప్పించుకునే మార్గం లేకే?... నది తీర ప్రాంతంలో మావోయిస్టులు గుడారాలు వేసుకున్న ఆనవాలు, ఘటనాస్థంలో కొన్ని వస్తువులు దర్శనమిచ్చాయి. ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో తప్పించుకునే మార్గం లేక మావోయిస్టులంతా నదిలోకి దూకేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మొసళ్లు, చేపలు పీక్కుతినటంతో మృతదేహాల గుర్తింపు కష్టతరంగా మారింది. మరోవైపు మృతుల్లో నలుగురు దళ కమాండర్లు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లో ఆహెరి, పెరిమిళ దళాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లేనని పోలీసులు ప్రకటించారు. 

మృతుల్లో పౌరులు లేరు... ఇక మృతుల్లో సాధారణ పౌరులు ఉన్నట్లు వస్తున్న వార్తలను తడ్‌గావ్‌ ఏఎస్సై సమీర్‌ దబాడే తోసిపుచ్చారు. ‘ఒకవేళ పౌరులు చనిపోయి ఉంటే వారి తరపు బంధువులుగానీ, ప్రజాసంఘాలుగానీ, నేతలుగానీ ఫిర్యాదు చేసి ఉండేవారు. కానీ, అలా జరగలేదు. చనిపోయివారంతా మావోయిస్టులే’ అని సమీర్‌ మీడియాకు వెల్లడించారు. ఇంద్రావతి నది పరిసరాల్లో కూంబింగ్‌ కొనసాగుతోందని.. మరిన్ని మృతదేహాలు బయటపడే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు.

                      మృతదేహాలను హెలికాఫ్టర్‌లో తరలిస్తున్న సీఆర్‌పీఎఫ్‌ బలగాలు

ఛత్తీస్‌గఢ్‌ సుక్మా జిల్లాలో శనివారం నక్సల్స్‌ జరిపిన దాడిలో సీఆర్పీఎఫ్‌ ఏఎస్సై ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆ వెంటనే నక్సల్స్‌ కోసం భారీ కూంబింగ్‌ ఆపరేషన్‌ ప్రారంభమైంది. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, సీఆర్పీఎఫ్‌, కోబ్రా బలగాలు సంయుక్తంగా కిలోమీటర్ల మేర అడవిని జల్లెడపట్టాయి. గడ్చిరోలి జిల్లా ఏటపల్లి వద్ద శనివారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో 16 మంది మావోయిస్టులు చనిపోయారు. ఆదివారం రాత్రి సుక్మా జిల్లాలో 5 గురు..  రాజారాం ఖాండ్లా అడవి(గడ్చిరోలి)లోని జిమాల్‌గట్ట ప్రాంతంలో 4గురు మృతి చెందగా.. మంగళవారం ఉదయం గడ్చిరోలి జిల్లా ఇంద్రావతి నదీ తీరంలో 15 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. 

మరిన్ని వార్తలు