వార్డు సభ్యునిగా పోటీ చేసేందుకు పంతం.. వ్యక్తి మృతి

9 Jan, 2019 08:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఘర్షణలో ఒకరి మృతి

సాక్షి, తుర్కపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుల పోటీ విషయంలో తలెత్తిన ఘర్షణ ఒకరి ప్రాణం తీసింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ధర్మారం గ్రామ పంచాయతీ పరిధి పెద్ద తండాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పెద్ద తండా కింద రెండు వార్డులు ఉన్నాయి. తండాకు చెందిన అజ్మీరా రవినాయక్‌ (28) ఈసారి పంచాయతీ ఎన్నికల్లో 8వ వార్డు నుంచి సోదరుడి కుమారుడైన శ్రీకాంత్‌ను రంగంలోకి దించాలని నిర్ణయించుకున్నాడు. ఇదే వార్డుపై రవినాయక్‌ దాయాదులైన శ్రీనివాస్‌ నాయక్, నరేశ్‌లు ఆసక్తి కనబరిచారు. దీంతో నరేశ్‌ తన సోదరుడి కుమారుడు మాల్‌నాయక్‌తో వార్డు సభ్యుడిగా పోటీ చేయించాలని ప్రయత్నం చేస్తున్నారు.

రెండు కుటుంబాల ఆసక్తి ఒకే వార్డుపై పడటంతో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలో సోమవారం రాత్రి లక్ష్మణ్‌ నాయక్, నరేశ్‌లు వారి కుటుంబ సభ్యులతో కలసి రవినాయక్‌ ఇంటికి వెళ్లి గొడవకు దిగారు. రవినాయక్‌ తన పక్కన ఉన్న కర్రతో నరేశ్‌ తలపై గట్టిగా కొట్టడంతో కింద పడిపోయాడు. కాసేపటికి నరేశ్‌ లేచి తన ఎదురుగా ఉన్న రవినాయక్‌ మర్మాంగంపై గట్టిగా తన్నడంతో అతడు కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే అతడిని కుటుంబ సభ్యులు, బంధువులు కలసి  మాదాపూర్‌లో ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. 

మరిన్ని వార్తలు