కర్రీ పాయింట్‌ వద్ద ఘర్షణ.. ఒకరికి గాయాలు

3 Feb, 2020 10:16 IST|Sakshi

పోలీసులకు ఇరువురి ఫిర్యాదు

నల్లకుంట: కర్రీ పాయింట్‌ వద్ద జరిగిన ఘర్షణలో ఒకరికి గాయాలైన ఘటన నల్లకుంట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఈ ఘటనలో ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. అడ్మిన్‌ ఎస్సై వీరశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గోల్నాక భాగ్యనగర్‌ బస్తీ నివాసి ప్రైవేట్‌ ఉద్యోగి ఆర్‌.రవి, అతనిస్నేహితుడు ఎస్‌.యాదగిరితో కలిసి శనివారం రాత్రి 11.25 గంటల సమయంలో నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రి సిగ్నల్స్‌ సమీపంలోని ఓ ఫాస్ట్‌ ఫుడ్‌సెంటర్‌కు వచ్చారు. అదే సమయంలో ఆ పక్కనే ఉన్న కర్రీ పాయింట్‌ వద్ద ఏదో గొడవ జరుగుతుంటే ఇద్దరు అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలో కర్రీ పాయింట్‌ నిర్వాహకుడికి రవికి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన ఎం.తిరుమలేశ్‌ ఖాళీ కూల్‌ డ్రింక్‌ బాటిల్‌ తీసుకుని రవి తలపై కొట్టాడు. తలకు గాయం కావడంతో రక్తం ఓడుతున్న రవి నేరుగా నల్లకుంట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. గాయపడిన రవిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి పంపించారు. తనను గాయపరిచిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని రవి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అసలేం జరిగిందంటే..
పోలీసులకు అందిన మరో ఫిర్యాదు ప్రకారం.. మస్తి విజయ అనే మహిళ నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రి సిగ్నల్స్‌ సమీపంలో శ్రీలక్ష్మి కర్రీ పాయింట్‌ నిర్వహిస్తోంది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో కర్రీ పాయింట్‌ పక్కనే ఉన్న రాజు ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్‌కు గోల్నాకకు చెందిన ఆర్‌.రవి, ఎస్‌.యాదగిరి వచ్చారు. ఆ తర్వాత పక్కనే ఉన్న కర్రీ పాయింట్‌ వద్దకు వెళ్లి కర్రీ పాయింట్‌లోని స్టూళ్లపై కూర్చున్నారు. ఆ సమయంలో కర్రీ ప్యాకెట్లు పార్సల్‌ కడుత్ను విజయ ఏం కావాలని వీరిని పలుమార్లు అడిగింది. అయినా వారి నుంచి స్పందన రాలేదు. అదే సమయంలో కర్రీ పాయింట్‌లోకి వచ్చిన విజయ భర్త ఎం.తిరుమలేశ్‌ అక్కడ కూర్చున్న రవి, యాదగిరిలను ఏం కావాలని అడిగాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది.

ఇంతలోనే అసభ్య పదజాలంతో దూషిస్తూ తిరుమలేశ్‌ను ఇద్దరు కలిసి తోసివేశారు. అది గమనించిన విజయ వెంటనే భర్త తిరుమలేశ్‌ను గేట్‌ లోపలికి తీసుకు వెళ్లింది. అయినా గేట్‌ తోసుకుంటూ లోపలికి వచ్చిన రవి, యాదగిరిలు అక్కడ ఉన్న ఖాళీ కూల్‌ డ్రిక్స్‌ బాటిళ్ళను కింద పడవేసి హంగామా చేస్తూ తిరుమలేశ్‌పై చేయి చేసుకున్నారు. దీంతో ఆత్మరక్షణ కోసం తిరుమలేశ్‌ ఓ కూల్‌ డ్రింక్‌ బాటిల్‌ తీసి వారిపై విసిరాడు. తమ కర్రీ పాయింట్‌లోకి వచ్చి తనపై దాడిచేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని తిరుమలేశ్‌ ఆదివారం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో ఆ ఇద్దరు మద్యం తాగి ఉన్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇరువురి నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు