జగన్‌పై హత్యాయత్నం కేసులో తుది చార్జిషీట్‌ దాఖలు

24 Jan, 2019 03:00 IST|Sakshi

నిబంధనలను అనుసరించే దర్యాప్తు

జైలు అధికారుల నుంచి నిందితుడు రాసిన లేఖ తీసుకున్నాం.. మరిన్నిఆధారాలు లభిస్తే మీ ముందుంచుతాం

ఇన్‌ కెమెరా ప్రొసీడింగ్స్‌ నిర్వహించండి

కోర్టుకు ఎన్‌ఐఏ నివేదన

నిందితుడి రెండు మెమోలపై 25న ఉత్తర్వులిస్తామన్న న్యాయస్థానం

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు బుధవారం ఎన్‌ఐఏ కోర్టులో తుది చార్జిషీట్‌ దాఖలు చేశారు. దీంతోపాటు పలు డాక్యుమెంట్లను సైతం సమర్పించారు. తదుపరి దర్యాప్తును కొనసాగించి ఆధారాలను సమర్పిస్తామని ఎన్‌ఐఏ ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టుకు నివేదించారు. కాగా, వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాసరావు తరఫున న్యాయవాదులు దాఖలు చేసిన రెండు మెమోలపై తదుపరి విచారణ ఈ నెల 25కి వాయిదా పడింది. శ్రీనివాసరావు రాసిన 22 పేజీల లేఖను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుందని, ఆ లేఖను తమకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ అతడి తరఫున న్యాయవాది మెమో దాఖలు చేశారు. అలాగే శ్రీనివాసరావును విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకునే విషయంలో ఎన్‌ఐఏ అధికారులు తమకు సరైన సమాచారం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. తమ ప్రమేయం లేకుండా జరిగిన విచారణకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకోరాదంటూ మరో మెమో దాఖలు చేశారు. 

జైలు అధికారులు తీసుకున్నారని నిందితుడే చెప్పాడు
ఈ సందర్భంగా నిందితుడు శ్రీనివాసరావు తరఫున న్యాయవాది మట్టా జయకర్‌ వాదనలు వినిపిస్తూ నిందితుడు రాసిన 22 పేజీల లేఖను అతని ఇష్టానికి విరుద్ధంగా ఎన్‌ఐఏ అధికారులు తీసుకున్నారని చెప్పారు. న్యాయమూర్తి స్పందిస్తూ నిందితుడిని కోర్టు ముందు ప్రవేశపెట్టినప్పుడు.. తాను స్వయంగా అడిగినప్పుడు పుస్తకం రాశానని, దాన్ని జైలు అధికారులు తీసుకున్నారని శ్రీనివాసరావు స్పష్టంగా చెప్పాడని గుర్తు చేశారు. జయకర్‌ వాదనలను కొనసాగిస్తూ.. శ్రీనివాసరావును కస్టడీలోకి తీసుకునే రోజున జైలు లోపల, బయట ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ఈ సమయంలో ఎన్‌ఐఏ తరఫున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ జోక్యం చేసుకుంటూ నిందితుడు రాసిన లేఖను దర్యాప్తులో భాగంగా జైలు అధికారుల నుంచి తీసుకున్నామని చెప్పారు. నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని పిటిషనర్లు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. ఈ కేసులో తాము చార్జిషీట్‌ దాఖలు చేస్తున్నామని, ఆ లేఖను చార్జిషీట్‌తోపాటు కోర్టు ముందుంచుతున్నామన్నారు. తాము లేవనెత్తిన అభ్యంతరాలను చదవకుండానే నిందితుడి తరఫున న్యాయవాది ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. న్యాయవాదుల సమక్షంలో శ్రీనివాసరావును విచారించాలని ప్రత్యేక కోర్టు ఆదేశించిందని తెలిపారు. నిందితుడి తరఫున న్యాయవాది సలీం ఫోన్‌ నెంబర్‌ తెలుసుకుని, నిందితుడిని ఎక్కడకు తీసుకెళుతున్నాం? ఎక్కడ విచారిస్తాం? ఎన్ని గంటలకు విచారిస్తాం? తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలియచేశామన్నారు. సలీంకు చేసిన ఫోన్‌ కాల్స్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను సైతం కోర్టు ముందుంచారు.
 
ఎవరిని పడితే వారిని అనుమతించడం సాధ్యం కాదు
విచారణ సమయంలో శ్రీనివాసరావును ఎన్‌ఐఏ అధికారులు బాగా చూసుకున్నారని ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టుకు తెలిపారు. విచారణ సమయంలో ఎవరిని పడితే వారిని అనుమతించడం సాధ్యం కాదని, శ్రీనివాసరావు తరఫున న్యాయవాదులమని చెప్పి వచ్చి, అతడికి ఏదైనా హాని తలపెడితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. ఈ కేసులో మీడియా ట్రయిల్‌ జరుగుతోందని, విచారణకు సంబంధించిన వివరాలను సలీం మీడియాకు తెలియచేశారని కోర్టుకు నివేదించారు. అందువల్ల ఈ కేసును బహిరంగంగా కాకుండా ఇన్‌ కెమెరా ప్రొసీడింగ్స్‌ ద్వారా విచారించాలని కోరారు. నిరాధార ఆరోపణలతో నిందితుడి తరఫున దాఖలు చేసిన మెమోలను కొట్టేయాలని కోరారు.

వాదనలు విన్న న్యాయమూర్తి ఈ రెండు మెమోలపై ఉత్తర్వులను ఈ నెల 25న వెలువరిస్తానని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఈ కేసులో అటు రాష్ట్ర పోలీసుల సిట్, ఇటు ఎన్‌ఐఏ అధికారులు నిష్పాక్షికంగా దర్యాప్తు జరపడంలేదని, ఈ కేసులో వారు ఏ పత్రాల మీద ఆధారపడుతున్నారో వాటిని తమకు అందచేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ శ్రీనివాసరావు తరఫున మరో మెమో దాఖలైంది. ఈ మెమోపై స్పందించాలని ఎన్‌ఐఏ ప్రత్యేక పీపీని న్యాయమూర్తి ఆదేశించారు. 

మరిన్ని వార్తలు