ఇట్టే దొరికిపోతారు!

13 Jul, 2020 07:19 IST|Sakshi

ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌తో నేరస్తుల చరిత్ర భద్రం

దేశంలో ఎక్కడ నేరం చేసిన పట్టివేత  

అల్లాదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు

అల్లాదుర్గం(మెదక్‌): గతంలో నేరస్తుల వేలిముద్రలు తీసుకొనేవారు.. నేడు నేరస్తుల వేలిముద్రలను ఫింగర్‌ ప్రింట్‌ (లైవ్‌) స్కానర్‌ సహాయంతో కంప్యూటర్‌లో భద్రపరుస్తున్నారు. హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, అత్యాచారాలు చేసిన నేరస్తుల వేలిముద్రలను స్కానర్‌తో సేకరిస్తున్నారు. మళ్లీ ఇదే నేరస్తులు ఎక్కడైనా నేరాలు చేస్తే ఫింగర్‌ ప్రింట్‌ ఆధారంగా వారి బయోడేటా పూర్తిగా తెలుస్తుంది. అల్లాదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ను ఏర్పాటు చేశారు. అల్లాదుర్గం సర్కిల్‌ పరిధిలో టేక్మాల్, రేగోడ్, పెద్దశంకరంపేట మండలాలు ఉన్నాయి. సర్కిల్‌ పోలీస్‌స్టేషన్‌ కావడంతో అల్లాదుర్గంలో ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ ఏర్పాటు చేశారు. సర్కిల్‌ పరిధిలో ఎక్కడైనా నేరస్తులు పట్టుబడితే వేలిముద్రలను స్కాన్‌ చేసి కంప్యూటర్‌లో భద్రంగా ఉంచేలా ఏర్పాటు చేశారు. వేలిముద్రలు తీసుకున్న నేరస్తులు దేశంలో ఎక్కడా నేరాలు చేసిన వేలిముద్రల ఆధారంగా వారి పూర్తి వివరాలు తెలియడంతో సులువుగా నేరస్తులను పోలీసులు పట్టుకునే అవకాశం ఉంటుంది.

ఆన్‌లైన్‌లో నమోదు..
ఎలాంటి నేరాలు చేసినా నేరస్తుల వేలిముద్రలే పట్టిస్తాయి. వారి వేలిముద్రలు భద్రపర్చేందుకు ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ను సర్కిల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేశాం. అత్యాచారం, హత్య, హత్యాయత్నం, దొంగతనాలు, దోపిడీలు చేసిన నేరస్తుల వేలిముద్రలను స్కానింగ్‌ చేసి ఆన్‌లైన్‌లో భద్ర పరుస్తున్నాం. అలాగే స్కాన్‌ చేసేటప్పుడు వారి ఆధార్‌కార్డు, నివాసం, జిల్లా, రాష్ట్రం పేర్లు నమోదు చేస్తున్నాం. నేరస్తులు ఏ రాష్ట్రంలో నేరాలు చేసిన వేలిముద్రల ఆధారంగా వెంటనే పట్టుకుంటాం. ఇటీవల గడిపెద్దాపూర్‌లో హత్యాయత్నం చేసిన బుడ్డాయిపల్లికి చెందిన నేరస్తుల వేలిముద్రలను స్కాన్‌ చేసి అన్‌లైన్‌లో నమోదు చేశాం.  –  మోహన్‌రెడ్డి, ఎస్‌ఐ

మరిన్ని వార్తలు