మంటల వెనక మతలబు ఏంటో!

11 Mar, 2020 08:40 IST|Sakshi

గోషామహల్‌ స్టేడియంలో తరచూ అగ్నిప్రమాదాలు

పలు అనుమానాలకు తావిస్తున్న ఉదంతాలు

అగ్నికి ఆహుతి అవుతున్న వాహనాలు

ప్రతి సందర్భంలోనూ నామమాత్రపు విచారణలే

అనుభవాలున్నా నిరోధక చర్యలు మాత్రం శూన్యం

సాక్షి, సిటీబ్యూరో: గోషామహల్‌లోని పోలీస్‌ స్టేడియం ఆవరణలో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫలితంగా అక్కడ ఉన్న పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాల్లోని 16 ఫోర్‌ వీలర్లు, 5 ఆటోలు, 37 టూ వీలర్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. నగరంలో ఏటా బోనాలు, గణేష్‌ ఉత్సవాలు, మొహర్రం ఊరేగింపు జరిగినట్లే గోషామహల్‌ పోలీసుస్టేడియంలోని వాహనాలు తరచూ అగ్నికి ఆహుతి కావడం పరిపాటిగా మారింది. ఈ పరంపరలో భాగంగానే శుక్రవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఉదంతాలు చోటు చేసుకున్నా రక్షణ చర్యలు లేకపోవడం వెనుక ఆంతర్యం అంతుచిక్కట్లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న, ఎక్కడెక్కడో లభించిన గుర్తుతెలియని వాహనాలను స్థానిక పోలీసులు ఈ గ్రౌండ్‌కు తరలిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వాహనాలు, వాటి శిథిలాల్లో ఈ ప్రాంతం నిండిపోయి ఉంటుంది. 

సిబ్బంది చేతివాటంపై అనుమానాలు..
నేరాలకు సంబంధించి పోలీసులు స్వాధీనం చేసుకున్న, వారికి లభ్యమైన గుర్తుతెలియని వాహనాలు గోషామహల్‌ పోలీసు స్టేడియానికి చేరిన కొన్ని రోజుల్లోనే ‘రూపు కోల్పోతున్నాయి’ అనేది జగమెరిగిన సత్యం. దీనికి సరైన నిర్వహణ లేకపోవడం ఒక కారణమైతే.. బాడీ, స్పేర్‌ పార్ట్స్‌ ‘మారిపోవడం’ మరో కారణం. ఈ స్టేడియంలోనే వాహనాల్లో ఉండే స్టీరియోలు, సీట్లు, కీలకమైన ఇంజన్‌ విడిభాగాలతో పాటు వాటి టైర్లూ కూడా మారిపోతుంటాయనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు ‘ఇంటి దొంగలు’ తమ చేతి వాటం ప్రదర్శించి వాహనాలకు ఈ దుస్థితి పట్టిస్తుంటారనేది బహిరంగ రహస్యం. నేరాల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను బాధితులు కోర్టు ద్వారా పొందాల్సి ఉంటుంది. ఇందులో కొంత జాప్యం ఉంటుంది. వీటి కోసం ఎప్పటికైనా ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉంది. ఇక గుర్తుతెలియని వాహనాల విషయానికి వస్తే వీటికి కోసం వచ్చే వారు అరుదు. వీటిని క్యాష్‌ చేసుకుంటూ కొందరు సిబ్బంది చేతి వాటం ప్రదర్శిస్తుంటారని తెలిసింది. వాహనం వచ్చిన తొలిరోజుల్లో డీజిల్, పెట్రోల్‌లతో ప్రారంభించి కొన్ని రోజులకు స్పేర్స్‌ కూడా ‘లేపేస్తుంటారు’ అనే ఆరోపణలు ఉన్నాయి.  

పాఠాలు నేర్పని అనుభవాలు..
ఈ స్టేడియంలో పడి ఉండే వాహనాలకు అవసరమైన ఎలాంటి రక్షణ చర్యలు ఉండవు. కనీసం ఒక పక్కా షెడ్డు కూడా లేదు. అక్కడున్నవి ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ పడి ఉండాల్సిందే. మరోపక్క ఇక్కడ గతంలోనూ పలుసార్లు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ వీటికి చెక్‌ చెప్పేందుకు ఎలాంటి చర్యలూ తీసుకున్న దాఖలాలు లేవు. స్వాధీనం చేసుకున్న వాహనాల్లో పెట్రోల్, డీజిల్‌తో పాటు అగ్నిని ఆకర్షించే అనేక పదార్ధాలు ఉన్నాయని తెలిసినప్పటికీ కనీసం ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్లు, ఇసుక బక్కెట్లు కూడా ఆ ప్రాంతంలోని సిబ్బంది వద్ద అందుబాటులో ఉండవు. వెరసీ.. గోషామహల్‌ కేంద్రంగా జరిగే అగ్ని ప్రమాదాల్లో అనునిత్యం అనేక వాహనాలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి.

ప్రమాదమా? వ్యూహాత్మకమా?
ఈ కారణాల వల్లే ఇక్కడ ఉండే వాహనాలు చాలా వరకు రూపు కోల్పోతాయి. వీటిని రెగ్యులర్‌ ఆడిటింగ్‌ లేకపోవడంతో సాధారణ సమయాల్లో ఈ మార్పు చేర్పులు గుర్తించడం సాధ్యం కాదు. ఈ వాహనాలను నిర్ణీత సమయానికి ఒకసారి వేలం పాట నిర్వహించడం ద్వారా విక్రయిస్తుంటారు. యాక్షన్‌ వేసే సందర్భంలో మాత్రం అక్కడ జరిగిన తారుమారులకు సంబంధించిన వ్యవహారాలన్నీ బయటకు పొక్కే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో గోషామహల్‌లోని వాహనాలను వేలం పాట నిర్వహించే సమయానికి కాస్త అటు ఇటుగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈసారి మాత్రం దానికి భిన్నంగా జరిగిందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయా సమయాల్లోనే అగ్ని ప్రమాదాలు జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతుంటాయి. అవన్నీ వాస్తవంటా ప్రమాదాలా? లేక చేతి వాటం బయటపడకుండా చేసిన వ్యూహాత్మక చర్యలా అనేది తేల్చడానికంటూ ప్రతి సందర్భంలోని విచారణలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇవి కొలిక్కివచ్చిన దాఖలాలు కనిపించట్లేదు. 

>
మరిన్ని వార్తలు