భువనగిరిలో భారీ అగ్ని ప్రమాదం

19 Mar, 2019 13:14 IST|Sakshi
కెమికల్‌ ఫ్యాక్టరీలో ఎగిసిపడుతున్న మంటలు, మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

సాక్షి, భువనగిరి అర్బన్‌ :  కెమికల్‌ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన భువనగిరి పట్టణ శివారులోని పారిశ్రామిక వాడలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక పారిశ్రామిక వాడలోని మహాసాయి ఫైర్‌ కెమికల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో పెయింటింగ్, నెయిల్‌ పాలీష్, వార్నిష్‌లలో ఉపయోగించే లిక్విడ్‌ను తయారు చేస్తారు. రోజు మాదిరిగా ఆదివారం రాత్రి లిక్విడ్‌ను తయారు చేసే ప్రక్రియను కొనసాగించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటాక 2.15 గంటల సమయంలో కంపెనీలో లిక్విడ్‌ కోసం ఉపయోగించే రామెటిరియల్‌లో ఇథైన్, టోలిన్, మిథైల్‌ పంపింగ్‌ చేస్తున్న క్రమంలో మోటారు యంత్రంలో ఏర్పడిన విద్యుత్‌ హెచ్చుతగ్గుల వల్ల షార్ట్‌ సర్క్యూట్‌ జరిగింది. ఈ క్రమంలో నిప్పు రవ్వలు లేచి మంటలుగా వ్యాపించాయి. సమీపంలో ఉన్న ప్లాస్టిక్‌ డ్రమ్ములకు మంటలు అంటుకున్నాయి. వెంటనే అక్కడున్న సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న ఫైర్‌సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఘటన సమాచారం అందుకున్న భువనగిరి ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది అగ్ని ప్రమాదం జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. భారీగా మంటలు ఎగిసి పడుతుండడంతో యాదగిరిగుట్ట, చౌటుప్పల్, రామన్నపేట నుంచి అగ్ని మాపక యంత్రాలను రప్పించారు. నాలుగు ఫైర్‌ ఇంజన్లతో 22 మంది సిబ్బంది కలిసి ఉదయం 7.30 గంటల వరకు మంటలను ఆర్పే కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 6 గంటల పాటు శ్రమించి ఫైర్‌ సిబ్బంది మంటలను అర్పారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రూ.9 నుంచి రూ.10 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు. 

భారీగా ఎగిసిపడిన మంటలు
పారిశ్రామిక వాడలో పక్కపక్కనే పరిశ్రమలు ఉండడంతో  కెమికల్‌ కంపెనీలో అగ్ని ప్రమాద ప్రభావం సమీపంలోని పరిశ్రమలపై పడింది. కంపెనీలో కెమికల్, ప్లాస్టిక్‌ డ్రమ్ములకు మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.ఈ క్రమంలో మంటల పక్కనే ఉన్న మ్యాట్రిసెస్‌ కంపెనీలోకి వ్యాపించాయి. దీంతో మ్యాట్రిస్‌ కంపెనీ రేకులు, మ్యాట్రిసెస్‌లో వాడే కాయర్, ఫోం పూర్తిగా దగ్ధమైంది. దీంతో కొన్ని రూ.లక్షల వరకు ఆ కంపెనీలో నష్టం జరిగింది.
 
ఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు
అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని  ఉమ్మడి జిల్లా అ గ్నిమాపక అధికారి వై.నారాయణ, భువనగిరి అర్డీ ఓ వెంకటేశ్వర్లు, ఏఓ మందడి ఉపేందర్‌రెడ్డి, భు వనగిరి అగ్నిమాపక కేంద్రం అధికారి అశోక్, చౌ టుప్పల్‌ ఫైర్‌స్టేషన్‌ అధికారి శ్రీశైలం,  యాదగిరి గుట్ట సీఐ అంజనేయులు  పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.  

మరిన్ని వార్తలు