ముంబైలోని పెట్రోలియం రిఫైనరీలో అగ్నిప్రమాదం 

9 Aug, 2018 04:50 IST|Sakshi

ముంబై: దేశ ఆర్థిక రాజధానిలో భారత్‌ పెట్రోలియం శుద్ధి కర్మాగారంలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 43 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో 22 మందికి ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి పంపించామని, 21 మందిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించామని ఆరో జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ షహజి ఉమాప్‌ తెలిపారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తూర్పు ముంబైలోని చెంబూర్‌ ప్రాంతంలో ఉన్న కర్మాగారంలో మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో సంభవించిన పేలుడు కారణంగా మంటలు చెలరేగాయి. తొమ్మిది ఫైర్‌ ఇంజన్లు, రెండు ఫోమ్‌ ఇంజన్లు, రెండు జంబో ట్యాంకర్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. హైడ్రోక్రాకర్‌ ప్లాంట్‌లోని కంప్రెషర్‌ షెడ్ల వేడి, ఒత్తిడి వల్ల పేలుడు సంభవించినట్లు సంస్థ తెలిపింది. పేలుడు ధాటికి రిఫైనరీకి 500 మీటర్ల పరిధిలో గల భవనాల అద్దాలు పగిలిపోయినట్లు స్థానికులు చెప్పారు.    

మరిన్ని వార్తలు