ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో అగ్నిప్రమాదం

1 May, 2019 09:25 IST|Sakshi
రేణిగుంట ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో ఎగసిపడుతున్న మంటలు

రెండు కర్మాగారాలు అగ్నికి ఆహుతి

రూ.20లక్షల ఆస్తి నష్టం

చిత్తూరు, రేణిగుంట : రేణిగుంట– తిరుపతి మార్గంలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు చిన్న తరహా కర్మాగారాలు కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.20లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. రేణిగుంట ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లోని ఏపీఐఐసీ రీజనల్‌ కార్యాలయ సమీపంలో ఉన్న ఓ ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ ఫ్యాక్టరీలో ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు తెల్లవారుజామున 3గంటలకు అకస్మాత్తుగా అంటుకున్నాయి. మంటలు పెద్దఎత్తున ఎగసిపడటంతో పక్కనున్న చీపురు ప్లాస్టిక్‌ బుర్రల తయారీ కర్మాగారానికి మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో తెల్లవారుజామున 4గంటల నుంచి వారు సుమారు నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. అయితే అప్పటికే కర్మాగారాలు పూర్తిగా బుగ్గి అయ్యాయి. ఫ్యాక్టరీకి ఆనుకుని ఉన్న విద్యుత్‌ తీగలు సైతం మంటల్లో కాలిపోయి తెగిపడ్డాయి. ప్రమాద విషయం తెలుసుకుని అప్పటికే ట్రాన్స్‌కో సిబ్బంది విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. ఫ్యాక్టరీ లోపల మండే స్వభావం ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉండటంతో మంటలను తొందరగా అదుపులోకి తీసుకురావడం సాధ్యం కాలేదు. కాగా, ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. అటుగా వెళుతున్న గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా నిప్పు రాజేశారా...? పైనున్న విద్యుత్‌ తీగలు షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి మంటలు ఎగసిపడ్డాయా...? అని బాధితులు అనుమానిస్తున్నారు.

తరచూ అగ్ని ప్రమాదాలు..
రేణిగుంట ఇండస్ట్రియల్‌ ఎస్టేట్లో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో ఓ దూది వ్యర్థాల పరిశ్రమలోనూ అగ్నిప్రమాదం సంభవించింది. ఏడాది కిందట బిందెల కర్మాగారంలోనూ ఇదే తరహా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఇండస్ట్రియల్‌ ఎస్టేట్లో కుటీర, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సుమారు 80కి పైగా ఉన్నాయి. వీటిలో సగభాగానికి పైగా కర్మాగారాలు నిర్దేశిత భద్రతా చర్యలు, కార్మికుల సేఫ్టీ చర్యలు తీసుకోవడం లేదు. సంబంధిత శాఖ అధికారులు మామూళ్ల మత్తులో కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఆస్తి నష్టానికే పరిమితమవుతున్న అగ్నిప్రమాదాలలో ప్రాణనష్టం జరగక ముందే అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ప్రజాసంఘాలు నినదిస్తున్నాయి.

మరిన్ని వార్తలు