అనుకోని ఆపద.. అంతా బూడిద

18 Sep, 2018 07:18 IST|Sakshi
థియేటర్‌లో కాలి బూడిదైన కుర్చీలు, స్క్రీన్‌ థియేటర్‌ నుంచి ఎగసిపడుతున్న మంటలు

శ్రీకన్య కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

పూర్తిగా కాలి బూడిదైన రెండు థియేటర్లు

వేకువజామున ప్రమాదంతో తప్పిన ప్రాణనష్టం

ఇంకా తేలని ఆస్తి నష్టం విలువ

ఆందోళనకు గురైన పట్టణవాసులు

విశాఖపట్నం, గాజువాక: తెలతెలవారుతుండగానే గాజువాక ఉలిక్కిపడింది. నిద్ర నుంచి తేరుకోకముందే ఎగసి పడుతున్న మంటలు, అగ్నిమాపక శకటాల హారన్లతో గాజువాక వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. గాజువాక మెయిన్‌రోడ్‌లోని శ్రీకన్య సినీ కాంప్లెక్స్‌లో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదంతో స్థానికులు ఒకింత దిగ్భ్రాంతికి గురయ్యారు. సోమవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు, అగ్నిమాపక విభాగం అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

గాజువాక మెయిన్‌ రోడ్‌లోని కన్య, శ్రీకన్య కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు థియేటర్లు కాలి బూడిదయ్యాయి. ఒకే భవనంలో మూడు సినిమా థియేటర్లు కొనసాగుతున్న విషయం తెలిసిం దే. పై అంతస్తులో చోటు చేసుకున్న విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఆధునిక పరికరాలతో కూడిన శ్రీకన్య (స్క్రీన్‌–2), హెవెన్‌ (స్క్రీన్‌–3)లకు చెందిన ప్రొజెక్టర్లు, సినిమా తెరలు, ఏసీ యూనిట్లు, కుర్చీలు పూర్తిగా కాలిపోయాయి. థియేటర్‌ స్లాబుపై ఏర్పాటు చేసిన సెల్‌ టవర్లు కూడా దెబ్బ తిన్నట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎనిమిది అగ్నిమాపక శకటాలతో ప్రయత్నించిన అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేయగలిగారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఫైరింజన్లు వచ్చేలోపే సర్వం ఆహుతి
సోమవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో శ్రీకన్య థియేటర్‌ స్క్రీన్‌కు సమీపంలో గల ఒక బల్బు పేలింది. ఆ సమయంలో ఎలక్ట్రికల్‌ బోర్డు నుంచి దట్టమైన పొగ మొదలైంది. దీన్ని గమనించిన స్వీపర్‌ చిట్టెమ్మ ఈ విషయాన్ని మేనేజర్‌కు తెలియజేసింది. ఆయన ఫిర్యాదుతో తొలుత పెదగంట్యాడ అగ్నిమాపక శకటంతో ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే భారీస్థాయిలో మంటలు ఎగసి పడుతుండటంతో హెచ్‌పీసీఎల్, హిందూస్తాన్‌ షిప్‌యార్డు, కోరమాండల్, విశాఖ స్టీల్‌ప్లాంట్, గాజువాక ఆటోనగర్‌లకు చెందిన ఫైరింజన్లు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని సుమారు రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. అయితే, అప్పటికే థియేటర్లు పూర్తిగా దగ్ధమై కోట్ల రూపాయల్లో ఆస్తినష్టం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఎంత నష్టపోయామన్న విషయాన్ని థియేటర్‌ యాజమాన్యం అధికారికంగా ప్రకటించలేదు. తమ ఇంజినీర్లు వచ్చి నష్టాన్ని అంచనా వేయాల్సి ఉందని థియేటర్‌ మేనేజర్‌ రమణబాబు అటు పోలీసులకు, ఇటు రెవెన్యూ అధికారులు, అగ్నిమాపక అధికారులకు తెలిపారు.

అధికారుల పర్యవేక్షణ
ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే వివిధ విభాగాల కు చెందిన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నగర డీసీపీ ఫకీరప్ప, సౌత్‌ జోన్‌ ఇన్‌ఛార్జి ఏసీపీరంగరాజు, గాజువాక సీఐ కె.రామారావు, వివిధ పోలీస్‌ స్టేషన్లకు చెందిన సీఐలు, ఎస్‌ఐలు, రెవెన్యూ అధికారులు ఇక్కడిపరిస్థితిని సమీ క్షించారు. మంటలను అదుపు చేయడానికి దగ్గరుండి ప్రయత్నించారు. ప్రమాదం జరిగిన తీరుపై ఫోరెన్సిక్‌ అధికారులు ప్రాథమిక సమాచారం సేకరించారు. ప్రమాదంపై లోతైన విచారణ చేపడతామని డీసీపీ ఫకీరప్ప తెలిపారు.

పని చేయని ఫైర్‌ టెండర్లు
థియేటర్‌లో అగ్ని ప్రమాదాలను అరికట్టడానికి ఏర్పాటు చేసిన ఫైర్‌ టెండర్లు సమయానికి పని చేయలేదు. అవి పని చేసి ఉంటే కొంతమేరకైనా ఆస్తిని పరిరక్షించుకొనే వీలుండేదని ఫైర్‌ సిబ్బంది తెలిపారు. కావాల్సినంత నీరు, ప్రతి ఫ్లోర్‌కు పైప్‌లైన్లు ఉన్నప్పటికీ నీరు పంపాల్సిన వాల్వు తెరుచుకోలేదు. వారం రోజుల క్రితం ఇక్కడ మాక్‌ డ్రిల్‌ చేసినట్టు కూడా సిబ్బంది చెబుతున్నారు. మాక్‌డ్రిల్‌లో పని చేసిన థియేటర్‌ ఫైర్‌ టెండర్‌ ఇప్పుడు పని చేయకపోవడం చర్చనీయాంశమైంది. ఈ రెండు థియేటర్లలోను సుమారు 750 మంది ప్రేక్షకులు కూర్చొనేందుకు కుర్చీలున్నాయి. థియేటర్లకు సిబ్బంది కూడా రాకముందే ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో ఎవరికీ ఏమీ కాలేదు. సినిమా ప్రదర్శన సమయంలో ప్రమాదం జరిగి ఉంటే ప్రాణనష్టం భారీగా ఉండేదని అధికారవర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు