శ్రుతిమించిన కట్నం వేధింపులు

15 Dec, 2019 08:04 IST|Sakshi
బాధితురాలిని రక్షించిన పోలీసులు (ఇన్‌సెట్‌లో) కానిస్టేబుల్‌ వీర నారాయణ

శాడిస్ట్‌గా మారిన ‘ఫైర్‌’ కానిస్టేబుల్‌

పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నించిన భార్య  

సకాలంలో పోలీసులు స్పందించడంతో సురక్షితం

అనంతపురం సెంట్రల్‌: అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్‌ అదనపు కట్నం కోసం శాడిస్ట్‌గా మారాడు. వేధింపులు భరించలేకపోయిన భార్య.. పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నించింది. అయితే పోలీసులు సకాలంలో స్పందించి వారి ప్రయత్నాన్ని అడ్డుకుని ప్రాణాలతో కాపాడారు.  బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం రూరల్‌ మండలం చిన్నకుంట గ్రామానికి చెందిన అగ్నిమాపకశాఖ కానిస్టేబుల్‌ వీరనారాయణకు 2014లో రాప్తాడుకు చెందిన యమున అనే యువతితో వివాహమైంది. కట్నకానుకల కింద రూ. 3 లక్షల నగదు, 16 తులాల బంగారు ఇవ్వడంతో పాటు ఘనంగా వివాహం కూడా జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం.

అయితే కొన్నేళ్లుగా భార్యను అదనపు కట్నం కోసం వీరనారాయణ వేధిస్తున్నాడు. ఎకరా భూమితో పాటు అదనపు కట్నం తీసుకువస్తేనే కాపురం చేస్తానని రోజూ వేధిస్తుండడంతో భరించలేని ఆమె శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇద్దరు కుమారులను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నా. నా కోసం ఎవరూ వెతకవద్దు’ అని కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి చెప్పి పెట్టేసింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఇటుకలపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఫోన్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు విడపనకల్లు ఎస్‌ఐ గోపీని అప్రమత్తం చేశారు. స్పందించిన ఎస్‌ఐ గోపీ తన సిబ్బందిని రంగంలోకి దింపారు. జిల్లా సరిహద్దు ప్రాంతమైన కర్ణాటకలోని చీకలగుర్కి ఎర్రితాతస్వామి దేవాలయం వద్ద బాధితురాలు, పిల్లలతో కలిసి ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సురక్షితంగా రాత్రికిరాత్రే ఇటుకలపల్లి పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. 

కౌన్సెలింగ్‌ ఇచ్చినా మారని కానిస్టేబుల్‌  
అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్‌ వీరనారాయణ వేధింపులపై భార్య గతంలోనే అప్పటి ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌కు ఫిర్యాదు చేసింది. డీఎస్పీ ఆధ్వర్యంలో కానిస్టేబుల్‌కు కౌన్సెలింగ్‌ ఇవ్వగా.. ఇక నుంచి భార్య, పిల్లలను బాగా చూసుకుంటానని రాతపూర్వకంగా తెలిపాడు. కానీ అతనిలో మార్పు మాత్రం రాలేదు. ఎకరాభూమి, అదనపు కట్నం తీసుకురావాలని, లేకుంటే ఇంట్లోకి రావద్దంటూ తెగేసి చెప్పాడు. భర్తతో పాటు, ఆడపడుచు ఈశ్వరమ్మ, అత్త, మామలు నారాయణమ్మ, నాగప్ప కూడా వేధింపులకు పాల్పడటంతో భరించలేక బలవన్మరణానికి పాల్పడబోయింది. వేధింపులపై బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇటుకలపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు