బోర్‌ కొట్టిందని ‘ఫైర్‌’ అయ్యాడు! 

13 Jan, 2019 08:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మీకు బోర్‌కొడితే ఏం చేస్తారు? వీడియో గేమ్స్‌ ఆడతారు. టైం ఉంటే సినిమాకెళ్తారు. ఇంకా ఏం చేస్తారు? తింటారు లేదా పడుకుంటారు. అయితే, ముంబైలో ఓ కుర్రాడు తనకు బోర్‌ కొడుతుందని ఏకంగా ఇళ్లకు నిప్పంటించడం మొదలు పెట్టాడు. ముంబైకి చెందిన అతని పేరు ర్యాన్‌ లుభం (19). పైగా, అతగాడు వాలంటీర్‌ ఫైర్‌ఫైటర్‌ కూడా! ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే అగ్నిమాపకశాఖకు కబురందిస్తాడు. అవసరమైతే వారితో కలసి రంగంలోకి దిగి మంటలు కూడా ఆర్పడం అతని పని. గత నెల ముంబైలోని ఆగ్నేయా పిట్స్‌బర్గ్‌లో ర్యాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. డిసెంబర్‌ 3, 10 తేదీల్లో స్థానికంగా ఉన్న ఇళ్లకు నిప్పంటించిన కేసులో అతడు దోషి.

ఇళ్లకు నిప్పంటించి బయటకు వచ్చి.. మళ్లీ తానే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ గుట్టు సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా బయటపడింది. నేరాన్ని అంగీకరించిన ర్యాన్‌.. బోర్‌ కొట్టడం వల్లనే ఆ పని చేసినట్లు విచారణలో చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఫైర్‌ ఫైటర్లే నిప్పంటించడం ఇప్పుడే కొత్త కాదు. అమెరికా సహా అన్ని దేశాల్లో ఏడాదికి వంద మందికి పైగా ఫైర్‌ఫైటర్లు ఇలాంటి కేసుల్లో అరెస్టవుతున్నారు. జర్మనీలో 30 అగ్ని ప్రమాదాలకు కారకుడైన ఆ దేశ ఫైర్‌ఫైటర్‌ గతేడాది అరెస్టయ్యాడు. ఇందుకు కోర్టు అతనికి 3 మిలియన్‌ డాలర్ల జరిమానా కూడా విధించింది. ఎందుకలా చేశావని అతన్ని పోలీసులు ప్రశ్నించగా.. నిప్పంటించడం తనకు సరదా అని, అందులో ఆనందం ఉందని చెప్పాడు!    

మరిన్ని వార్తలు