బాణాసంచా పేలుడు : ఆరుగురు దుర్మరణం

21 Sep, 2019 20:28 IST|Sakshi

సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్లో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది.  మిరేచి పట్టణంలో ఒక ఇంట్లో నిల్వ చేసిన  బాణాసంచా  పేలడంతో  ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. దీంతో ఫ్యాక్టరీ యజమానితోపాటు మరో  ఐదుగురు దుర్మరణం చెందారు.  పేలుడు ధాటికి  భవనం కుప్పకూలిపోవడంతో శిధిలాల కింద ఆరుగురు ప్రాణాలు కోల్పోగా,  పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని  ఆస్పత్రికి తరలించి  చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారిలో  ముగ్గురు చిన్నారులున్నారు. మిరేచి పట్టణంలోని టాకియా ప్రాంతంలో శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్,  పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్ధలానికి చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 

మిరేచి పోలీస్ స్టేషన్ పరిధిలో నివించే మున్నీ దేవి (35) ఇంట్లో ఈ పేలుడు సంభవించిందని, అదే ఏరియాలో నివసిస్తున్న ఒక గిరిరాజ్‌తో పాటు ఆమె కూడా  ఫ్యాక్టరీకి సహ యజమాని అని పోలీసులు తెలిపారు. ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తూ సంభవించిన ఈ  పేలుడులో దేవితో పాటు అంజలి (8), రాధా (12), ఖుషీ (6), షీటల్ (18), రజనీ (14) మరణించినట్లు జిల్లా మేజిస్ట్రేట్ సుఖ్లాల్ భారతి తెలిపారు. దేవీ కుమార్తెలు పూజ, మాధురితో మరో 12మంది గాయాలతో చికిత్స  పొందుతున్నారని తెలిపారు. ఈ ఫ్యాక్టరీలో బాణా సంచా తయారీకి దేవి, గిరిరాజ్‌లకు  అనుతులున్నప్పటికీ,  లెసెన్స్‌ చాలా పాతదని  పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు