ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

22 May, 2018 02:24 IST|Sakshi

ఢిల్లీ నుంచి విశాఖ వస్తుండగా గ్వాలియర్‌ వద్ద ఘటన

రెండు బోగీలు అగ్నికి ఆహుతి.. తప్పిన పెనుప్రమాదం

ప్రమాద సమయంలో రైలులో 37 మంది డిప్యూటీ కలెక్టర్లు

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, విశాఖపట్నం:  దేశ రాజధాని ఢిల్లీ నుంచి విశాఖపట్నం వస్తున్న ఏపీ సూపర్‌ ఫాస్ట్‌ ఏసీ ఎక్స్‌ప్రెస్‌ (22416) రైలులో మంటలు చెలరేగాయి. సోమవారం ఉదయం 6 గంటలకు న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన ఏపీ ఎక్స్‌ప్రెస్‌ 11.45 గంటల సమయంలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు 12 కి.మీ. దూరంలోని బిర్లానగర్‌ స్టేషన్‌ వద్ద బీ6, బీ7 బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ప్రయాణికులు ఎమర్జెన్సీ చైన్‌ను లాగి రైలును ఆపి వేశారు. రైలు నిలిచిన వెంటనే ప్రయాణికులు భయాందోళనతో ఒకరికొకరు తోసుకుంటూ కిందికి దూకడంతో పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఇంతకు మినహా ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆ రెండు బోగీల్లో 150 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒకవేళ వేగంగా కదులుతున్న రైలులో మంటలు వ్యాపించి ఉంటే పెను ప్రమాదం సంభవించి ఉండేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. శిక్షణ ముగించుకుని తిరిగివస్తున్న 37 మంది డిప్యూటీ కలెక్టర్లు కూడా ఈ రైలులో ఉన్నారు. వారెవరికీ గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కోచ్‌లోని ఎయిర్‌ కండిషన్‌ యూనిట్‌లో సమస్యతో మంటలు మొదలయ్యాయని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ‘బీ7 బోగీలోని టాయిలెట్‌పైనున్న రూఫ్‌ మౌంటెడ్‌ ప్యాకేజ్డ్‌ యూనిట్‌ (ఆర్‌ఎంపీయూ)లో మొదట మంటలు ప్రారంభమయ్యాయి’ రైల్వే అధికారి ఒకరు చెప్పారు.  స్టేషన్‌ నుంచి బయలుదేరిన వెంటనే మంటలు అంటుకున్నాయని, ఆ సమయంలో రైలు పూర్తి వేగాన్ని అందుకోలేదని గ్వాలియర్‌ రైల్వే పీఆర్‌వో మనోజ్‌ సింగ్‌ తెలిపారు. కాగా, రైలు నాలుగు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 3.30 గంటలకు గ్వాలియర్‌ జంక్షన్‌ నుంచి తిరిగి బయలుదేరింది. ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్టు రైల్వే శాఖ తెలిపింది. 
 
విశాఖలో ఆందోళన..
ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదానికి గురైన రెండు బోగీలు విశాఖపట్నం కోటాలో కేటాయించారు. ఈ బోగీల్లో 65 మంది విశాఖ వరకు రిజర్వేషన్‌ చేయించుకున్న వారున్నారు. దీంతో ఆ బోగీల్లో ఉన్న తమ వారి పరిస్థితిపై బంధువులు కలవరానికి గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో అందరూ సురక్షితంగా బయటపడ్డారని రైల్వే అధికారులు స్పష్టం చేయడంతో పాటు తమ వారితో ఫోన్లో సంప్రదించి క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నాక బంధువులు ఊరట చెందారు. మరోవైపు ప్రమాదానికి గురైన రెండు బోగీలతో పాటు వాటిని ఆనుకుని ఉన్న మరో రెంటిని కూడా భద్రతా కారణాల దృష్ట్యా తొలగించారు. వాటి స్థానంలో గ్వాలియర్‌లో మరో నాలుగు బోగీలను అమర్చారు. షెడ్యూలు ప్రకారం ఈ రైలు విశాఖకు మంగళవారం సాయంత్రం 5.50 గంటలకు రావలసి ఉండగా.. మంగళవారం రాత్రి 10 గంటలకు విశాఖ చేరుకోవచ్చని తూర్పు కోస్తా రైల్వే అధికారులు ‘సాక్షి’కి చెప్పారు. ప్రయాణికుల సమాచారం కోసం విశాఖ రైల్వే స్టేషన్లో మంగళవారం సాయంత్రం వరకూ హెల్ప్‌లైన్‌లను అందుబాటులో ఉంచారు. వివరాల కోసం 0891–2746330, 2746344, 2746338, 2744619, 2883003, 2883004, 2883005, 2883006 ల్యాండ్‌లైన్లతో పాటు 8500041673, 850041670 మొబైల్‌ నంబర్లను సంప్రదించవచ్చు. రైలు ప్రమాదం నేపథ్యంలో నార్త్‌ సెంట్రల్‌ రైల్వే అధికారులతో జీఎం ఉమేష్‌సింగ్, సీపీఆర్‌వో జేపీ మిశ్రా, వాల్తేరు డివిజన్‌ ఏడీఆర్‌ఎం కె.ధనుంజయరావు, చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఏకే బెహ్రా తదితరులు మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. 

మరిన్ని వార్తలు