అభయారణ్యంలో ఎదురుకాల్పులు

16 Jul, 2020 12:26 IST|Sakshi
ఎదురు కాల్పులు జరిగిన అటవీ ప్రాంతంలో పోలీస్‌ బలగాలు

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/ఇల్లెందు: మణుగూరు సబ్‌ డివిజన్‌ పరిధిలోని కరకగూడెం, ఆళ్లపల్లి మండలాల సరిహద్దులో ఉన్న అభయారణ్యంలో బుధవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్ట్‌ యాక్షన్‌ టీములు సంచరిస్తున్నాయనే సమాచారంతో మూడు రోజులుగా పోలీస్‌ బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం కరకగూడెం, ఆళ్లపల్లి సరిహద్దు మల్లేపల్లితోగు వద్ద మావోయిస్టులు తారసపడటంతో పరస్పరం కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో ఒక గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌కు బుల్లెట్‌ గాయాలయ్యాయి. 10 మంది వరకు మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే తప్పించుకున్నట్లు పోలీస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. కాల్పులు జరిగిన ప్రదేశంలో వారి సామగ్రి లభించింది. తప్పించుకున్న మావోయిస్టుల కోసం అదనపు బలగాలను మోహరించి కూంబింగ్‌ ముమ్మరం చేశారు. గాయపడ్డ కానిస్టేబుల్‌ను చికిత్స నిమిత్తం పోలీసులు హైదరాబాద్‌ తరలించారు.  కాగా ఆ ప్రాంతంలో ఎక్కువమంది మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

గోదావరి పరీవాహక ప్రాంతంలో..
మావోయిస్టులపై పోరులో భాగంగా పోలీసు బలగాలు గోదావరి పరీవాహక ప్రాంతం వ్యాప్తంగా కూంబింగ్‌ ప్రక్రియ ముమ్మరంగా చేపట్టాయి. గతంలో ఎండాకాలంలోనే మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలో, తెలంగాణలోని అభయారణ్యంలో పోరు జరిగేది. అయితే ప్రస్తుతం మాత్రం ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నప్పటికీ పోరు నడుస్తోంది. ఈ నెల 13న కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి అటవీ ప్రాంతంలోని మాంగీ వద్ద మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అక్కడ నుంచి నలుగురు మావోయిస్టులు తప్పించుకోగా, వారిలో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, మంచిర్యాల–ఆదిలాబాద్‌ డివిజన్‌ కార్యదర్శి మైలవరపు అడేళ్లు అలియాస్‌ భాస్కర్‌ కూడా ఉన్నట్లు సమాచారం. పోడు భూముల సమస్య నేపథ్యంలో మావోయిస్టులు తెలంగాణ జిల్లాల్లో ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాల నుంచి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాల మీదుగా వచ్చి గోదావరి దాటి మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, పినపాక, మణుగూరు, కరకగూడెం మండలాల మీదుగా ఇతర జిల్లాల్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు గోదావరి పరీవాహక అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. కాగా కూంబింగ్‌ కొనసాగుతుందని ఏఎస్పీ (ఆపరేషన్స్‌) రమణారెడ్డి తెలిపారు.

ఉలిక్కిపడ్డ ఏజెన్సీ
ఎదురుకాల్పుల సంఘటనతో ఏజెన్సీ ఉలిక్కి పడింది. మూడు రోజులుగా ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు సబ్‌ డివిజన్లలో స్పెషల్‌ పార్టీ బలగాలతో ముమ్మరంగా కూంబింగ్‌ చేస్తున్నారు. మావోయిస్టులు ఏజెన్సీ ప్రాంతంలోకి వచ్చినట్లు సమాచారం అందుకున్న వరంగల్, భద్రాద్రి పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలోనే మణుగూరు ఏరియాలోని మల్లేపల్లితోగు అటవీ ప్రాంతంలో ఉదయం 9గంటల ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగినట్లు భద్రాద్రి జిల్లా ఎస్పీ ప్రకటించారు. దామోదర్, భద్రూ, శాంత, భాస్కర్‌లతో కూడిన సుమారు 10 మంది మావోయిస్టుల కోసం అన్వేషిస్తుండగా, మణుగూరు ఏరియా మల్లేపల్లితోగు, రంగాపురం అటవీ ప్రాంతంలో నక్సల్స్‌ తారసపడటంతో ఎదురుకాల్పులు జరిగినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. కాల్పుల నేపథ్యంలో గుండాల మండలంలోని దామరతోగు, చెట్టుపల్లి అటవీ ప్రాంతం, తాడ్వాయి మండలంలోని దుబ్బగూడెం, గంగారం మండలంలోని పాకాల ఏరియా, ఇల్లెందు, గుండాల మండలాల సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్‌ ఉధృతం చేశారు.

2019 ఆగస్టు 21 తెల్లారుజామున మణుగూరు మండలం బుడుగుల అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గుండాల మండలం దామరతోగుకు చెందిన జాడి వీరస్వామి అలియాస్‌ రఘు మృతి చెందాడు. ఏడాదిలోపు అదే ప్రాంతంలో మళ్లీ ఎదురుకాల్పులు చోటుచేసుకోవడంతో ఏజెన్సీలో ఆందోళన నెలకొంది. రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగుతుండగా, ఇదే అదునుగా మావోయిస్టులు ఏజెన్సీలో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. ఏటా వర్షాకాలంలో ఆకు పచ్చబడ్డ తర్వాత ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణలోకి అడుగుపెడుతున్నారు. వర్షాల కారణంగా ఇప్పటికే అటవీ ప్రాంతం కూడా పచ్చబడింది. గతేడాది కూడా గుండాల మండలం రోళ్లగడ్డ వద్ద మావోయిస్టుల కోసం కూంబింగ్‌ నిర్వహిస్తున్న క్రమంలో న్యూడెమోక్రసీ దళనేత లింగన్న ఎన్‌కౌంటర్‌ జరిగింది. గుండాల మండలానికి ఆనుకునే ఉన్న ములుగు జిల్లాలోని మేడారం, ఊరట్టం, రెడ్డిగూడెంలలో రెండు రోజుల క్రితమే మావోయిస్టుల కరపత్రాలు వెలిశాయి.

మణుగూరురూరల్‌: ఎదురుకాల్పుల ఘటనతో మణుగూరు సబ్‌డివిజన్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఐ ఎంఏ షుకూర్‌ నేతృత్వంలో బుగ్గ, ఖమ్మంతోగు ప్రాంతాలకు వెళ్లే అటవీప్రాంతంలో తనిఖీలు చేస్తున్నారు. కాల్పుల ఘటనతో ఆదివాసీగూడేలు వణికిపోతున్నాయి.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా