అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి

14 Oct, 2017 15:29 IST|Sakshi

ఒత్తిడికి లోనయ్యేదంటున్న తోటి విద్యార్థులు

తనకు చనిపోవాలనిపిస్తోందని తండ్రికి ఫోన్‌ చేసిన వైనం

కళ్లు తిరిగి కిందపడిపోవడంతో ఆస్పత్రికి తరలింపు.. చికిత్స పొందుతూ మృతి

అస్వస్థతా.. ఆత్మహత్యా..?

నూజివీడు/రేగిడి(రాజాం): కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీకాకుళం జిల్లా బూరాడ గ్రామానికి చెందిన విద్యార్థిని డబ్బాడ రమాదేవి(16) శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బూరాడలో నివసించే డబ్బాడ అప్పల నాయుడు(ట్రాక్టర్‌ డ్రైవర్‌), వరలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుమార్తె రమాదేవి టెన్త్‌లో 10 జీపీఏతో ట్రిపుల్‌ఐటీకి ఎంపికైంది. క్యాంపస్‌లోని కే4 బాలికల హాస్టల్‌లో 69వ నంబర్‌ గదిలో ఉంటున్న రమాదేవి శనివారం తెల్లవారుజామున గది వెలుపల కారిడార్‌ పక్కన కిందపడి ఉండటాన్ని మహిళా సెక్యూరిటీ గార్డు గమనించి హాస్టల్‌ కేర్‌ టేకర్‌కు, చీఫ్‌ వార్డెన్‌కు సమాచారం అందించింది. బాలికను క్యాంపస్‌లోని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఎంజే నాయుడు ఆస్పత్రికి తరలించారు. అక్కడ  చికిత్స పొందుతూ శనివారం ఉదయం విద్యార్థిని మృతిచెందింది. రమాదేవి అస్వస్థతతో మరణించిందా? లేక భవనంపై భాగం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

నాన్నా.. చదవలేకపోతున్నా.. 
రమాదేవి శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి ఫోన్‌ చేసి, తాను సెకెండ్‌ మిడ్‌ పరీక్షలకు చదువుతున్నానని చెప్పింది. అయితే, ఇంత సమయం వరకు చదివితే ఆరోగ్యం పాడవుతుందని.. ఇక నిద్రించాలని తల్లిదండ్రులు సూచించడంతో ఫోన్‌ కట్‌ చేసింది. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు మళ్లీ ఫోన్‌ చేసింది. తండ్రి అప్పలనాయుడు ఫోన్‌ ఎత్తగా.. తాను రాత్రి 12 గంటల వరకు చదివిందంతా మరచి పోతున్నానని, ఏమీ గుర్తుండటం లేదని.. తనకు చనిపోవాలనిపిస్తోందని చెప్పింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన తండ్రి.. ఆమెను ఓదార్చి ఇంట్లోనే ఉన్న పెద్ద కుమార్తె భవానికి ఫోన్‌ ఇచ్చాడు. తన చెల్లికి ఆమె నచ్చజెప్పినప్పటికీ వినిపించుకోకుండా ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసినట్లు కుటుంబీకులు తెలిపారు.

వెంటనే నూజివీడు వెళ్లి రమాదేవిని ఇంటికి తీసుకొచ్చి కొద్ది రోజుల తర్వాత తిరిగి పంపిద్దామని అనుకున్నారు. ఇంతలోనే ఉదయం 7 గంటలకు ఆమె చనిపోయినట్లు కళాశాల నుంచి ఫోన్‌ రావడంతో కుటుంబ సభ్యులందరూ షాక్‌కు గురయ్యారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు