చేపల వేటలో మత్స్యకారుడి దుర్మరణం

17 May, 2019 11:44 IST|Sakshi
రామకృష్ణ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు (ఇన్‌సెట్‌)  మత్స్యకారుడు రామకృష్ణ (ఫైల్‌)  

తిరుమలాయపాలెం: మండలంలోని బచ్చోడు గ్రామంలోని ఏనెగచెరువులో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు చేపల వేట చేస్తూ తెప్పపై నుంచి పడిపోయి వలలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన చెన్నబోయిన రామకృష్ణ(38) గురువారం ఉదయం తోటి మత్స్యకారులతో కలిసి తెప్ప సహాయంతో చేపల వేట చేసేందుకు ఏనిగచెరువుకి వెళ్లాడు. వలను సరిచేసుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయాడు. ఇదే క్రమంలో వలలో కాళ్లు చిక్కుకుని బయటకు వెళ్లే మార్గం లేక నీటిలో మునిగిపోయి మృతిచెందాడు.

ఈ విషయాన్ని గమనించిన తోటి మత్స్యకారులు అతడి కోసం చెరువులో గాలింపు చేపట్టగా వలలో చిక్కుకుని విగతజీవిగా మారిన రామకృష్ణ మృతదేహాన్ని వెలికి తీశారు. చెరువు నిండుగా నీళ్లు ఉండడంతో శవాన్ని వెలికితీసేందుకు మత్స్యకారులు తీవ్రంగా శ్రమించారు. రెక్కాడితే కానీ..డొక్కాడని రామకృష్ణకు భార్య ఎల్లమ్మ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. చేపల వేటకు మృత్యువాత పడడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

ముదిరాజ్‌ సంఘం మండల అధ్యక్షుడు ఓర వెంకటేశ్వర్లు సందర్శించి నివాళులర్పించారు. రామకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేసి ఆదుకోవాలని కోరారు. సర్పంచ్‌ రామసహాయం హరితారెడ్డి కూడా సంఘటన స్థలానికి చేరుకుని మత్స్యకార్మికుడు రామకృష్ణ మృతిపట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.  బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు