సీఎంను దూషించిన కేసులో ఐదుగురి అరెస్ట్‌

29 Aug, 2019 05:02 IST|Sakshi

సత్యనారాయణపురం (విజయవాడ సెంట్రల్‌): ఇటీవల ఒక యూట్యూబ్‌ చానల్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ను, మంత్రి పి.అనిల్‌ కుమార్‌యాదవ్‌ని దూషించిన ఐదుగుర్ని సత్యనారాయణపురం పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం తిప్పలకట్ట గ్రామానికి చెందిన కుడిపూడి సోమశేఖర్‌ (46) పెయిడ్‌ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల వరద వల్ల తన పంటకు నష్టం వాటిల్లిందంటూ శేఖర్‌తోపాటు అదే గ్రామానికి చెందిన బొంతలపాటి శివప్రసాద్‌ అలియాస్‌ ప్రసాద్‌ (46), కొండూరి సీతారామయ్య (34), నిడుమోలు శివయ్య (35), అనంతవరం గ్రామానికి చెందిన సత్యేంద్ర (39) కలసి ప్రభుత్వ ప్రతిష్టను భంగపరచాలన్న ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్, మంత్రి అనిల్‌లను దుర్భాషలాడారు.

దీనిని తమ మొబైల్స్‌ ద్వారా వీడియో తీసి యూట్యూబ్, వాట్సాప్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. దీనిపై పలు సంఘాల నాయకులు సత్యనారాయణపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. నార్త్‌జోన్‌ ఏసీపీ షర్ఫుద్ధీన పర్యవేక్షణలో సత్యనారాయణపురం సీఐ బాలమురళీకృష్ణ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఆ ఐదుగురినీ సత్యనారాయణపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రైల్వే బుకింగ్‌ సమీపంలో అరెస్ట్‌ చేసి, వీడియో తీసిన మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 153, 153ఏ, 505(2) రెడ్‌విత్‌ 34, 120బీ కింద కేసు నమోదు చేశారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా వచ్చే నెల 7 వరకు రిమాండ్‌ విధించారు.
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా