బోటు ప్రమాదంలో ఐదుగురి మృతదేహాలు గుర్తింపు

24 Oct, 2019 05:08 IST|Sakshi

పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగింత

మూడు మృతదేహాల శాంపిల్స్‌ డీఎన్‌ఏ పరీక్షలకు పంపిన వైద్యులు

రాజమహేంద్రవరం రూరల్‌/రాజమహేంద్రవరం క్రైం: తమ వారి మృతదేహాల కోసం 38 రోజులపాటు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూశారు. కడచూపు దక్కకపోయినా.. ఇన్నాళ్లకు తమ వారి మృతదేహపు ఆనవాళ్లయినా దొరికాయని కొందరు.. తమ వారి ఆచూకీ నేటికీ దొరక్క మరికొందరు కన్నీటి పర్యంతమయ్యారు. గతనెల 15న తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ప్రమాద ఘటనలో.. బోటు వెలికితీత చివరి రోజైన మంగళవారం బోటులోనే 7 మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల కుటుంబ సభ్యులకు మంగళవారం రాత్రి ఫోన్‌ ద్వారా సమాచారం అందించడంతో బుధవారం ఉదయం వారంతా రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. తల ఉంటే మొండెం లేకపోవడం, మొండెం ఉంటే తల లేకపోవడంతో కొన్ని మృతదేహాలు గుర్తించలేని పరిస్థితి నెలకొంది. లభ్యమైన ఏడు మృతదేహాలలో ఐదింటిని కాకినాడకు చెందిన సంగాడి నూకరాజు (55), మరో డ్రైవర్‌ పోతాబత్తుల సత్యనారాయణ (62), నల్గొండ జిల్లా హలియా గ్రామానికి చెందిన సురభి రవీంద్ర (25), వరంగల్‌ జిల్లా కడిపి కొండ గ్రామానికి చెందిన  కొమ్ముల రవి (40), బస్కే ధర్మరాజు (48) మృతదేహాలుగా గుర్తించారు. ఆరో మృతదేహం తల, మొండెం లేకుండా కింది భాగం మాత్రమే ఉండగా.. అది మంచిర్యాలకు చెందిన కారకూరి రమ్యశ్రీ (24)దని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. అతి పాత పట్టిసీమకు చెందిన బోటు సహాయకుడు కర్రి మణికంఠదని అతని తండ్రి నరసింహారావు చెప్పారు. ఎటూ తేల్చకోలేని అధికారులు దాని శాంపిల్స్‌ను డీఎన్‌ఏ పరీక్షలకు పంపించారు. 

దుస్తులు, తాయెత్తు ఆధారంగా..
కాకినాడకు చెందిన బోటు సరంగు (డ్రైవర్‌) సంగాడి నూకరాజు మృతదేహాన్ని ఆయన వేసుకున్న టీషర్ట్‌ ఆధారంగా అతని కుమారుడు ధర్మారావు గుర్తించారు. వరంగల్‌ జిల్లా కడిపికొండకు చెందిన బస్కే ధర్మరాజును అతను వేసుకున్న బ్లూషర్ట్, బ్లాక్‌ ప్యాంట్‌ ఆధారంగా అతని బంధువులు గుర్తించారు. అదే గ్రామానికి చెందిన కొమ్ముల రవి మృతదేహాన్ని జేబులో ఉన్న ఆధార్‌ కార్డు, పర్సు ఆధారంగా, కాకినాడకు చెందిన బోటు అసిస్టెంట్‌ డ్రైవర్‌ పోతాబత్తుల సత్యనారాయణ మృతదేహాన్ని మెడలో తాయత్తు, వేసుకున్న టీషర్ట్‌ ఆధారంగా కుటుంబ సభ్యులు గుర్తించారు. నల్గొండ జిల్లా హాలియాసాగర్‌కు చెందిన పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఏఈ సురభి రవీంద్ర మృతదేహాన్ని అతడు ధరించిన రెడీమేడ్‌ షర్ట్‌ ఆధారంగా అతని సోదరుడు మహేష్‌ గుర్తించాడు. 

ఆ పుర్రె ఎవరిదో..
ఏడో మృతదేహానికి సంబంధించి తల (పుర్రె) మాత్రమే ఉండటంతో అది మహిళదా, పురుషునిదా అనే విషయం తేలలేదు. దానిని ఫోర్సెనిక్‌ ల్యాబ్‌కు పంపించి డీఎన్‌ఏ పరీక్ష చేయించాల్సి ఉందని వైద్యాధికారి సీహెచ్‌ రమేష్‌కిశోర్‌ తెలిపారు.

ఈ బాలుడెవరో..
ఇదిలావుంటే.. రెండు రోజుల కిందట లభించిన బాలుడి మృతదేహాన్ని విశాఖపట్నానికి చెందిన మధుపాడ అఖిలేష్‌ (5) లేదా కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన బాచిరెడ్డి విఖ్యాతరెడ్డి (6)దిగా భావిస్తున్నారు. అఖిలేష్‌ మేనమామ ఆ మృతదేహం తమ వాడిది కాదని తేల్చిచెప్పారు. దీంతో పోలీసులు బాచిరెడ్డి విఖ్యాతరెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందజేశారు. మొత్తంగా మూడు మృతదేహాల శాంపిల్స్‌ను డీఎన్‌ఏ పరీక్షల నిమిత్తం పంపించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు