వివాహ వేళ.. విషాద గీతిక

21 Feb, 2020 11:48 IST|Sakshi
కాలువలో బోల్తాపడిన ట్రాక్టర్‌, సంఘటన స్థలంలో పద్మ, అన్నమ్మ మృతదేహాల వద్ద రోదిస్తున్న బంధువులు

 అదుపుతప్పి బోల్తాపడిన పెళ్లి ట్రాక్టర్‌

ఐదుగురు మృత్యువాత, పది మందికి తీవ్ర గాయాలు

తెనాలిలో పెళ్లికి వెళ్లి వస్తుండగా చినపరిమి వద్ద ఘటన

మృతుల్లో నలుగురు చినపరిమి, ఒకరు కెల్లిపాలెంవాసులు

తీవ్ర శోకంలో కుటుంబ సభ్యులు

వివాహ మహోత్సవాన గుండెల్లో మూటకట్టుకుని వచ్చిన ఆనంద క్షణాలు రెప్పపాటులో ఆర్తనాదాలుగా మారాయి.. పెళ్లింట ఆకట్టుకున్న వివిధ వర్ణాల కట్టూబొట్టులు నెత్తుటి చెమ్మలో తడిచి ఎర్రటి రంగు పులుముకున్నాయి. బంధుమిత్రుల మధ్య సాగిన యోగక్షేమాల ముచ్చట్లు మూడు గంటలు కూడా గడవకముందే విషాదాంతమయ్యాయి. ట్రాక్టర్‌ వేగంతో పోటీ పడుతూ కలవరపెట్టిన కుదుపులు.. ఐదు కుటుంబాలను అంతులేని ఆవేదనతో కుదిపేశాయి. గురువారం చుండూరు మండలం చినపరిమి– కూచిపూడి మధ్య పెళ్లి ట్రాక్టర్‌ బోల్తాపడిన ఘటనలో ఐదు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. వీరిలో మేమూ వస్తామంటూ మారాం చేసి మరీ ట్రాక్టర్‌ ఎక్కిన ఇద్దరు చిన్నారుల జీవితాలు అర్ధంతరంగా చితిపైకి చేరాయి. కళ్లెదుటే మాంసం ముద్దలుగా మారిన బిడ్డను చూసి.. తల్లిదండ్రుల కన్నపేగులు తీరని శోకంతో కమిలిపోయాయి. ఉదయాన్నే రయ్యిమంటూ సంబరంగా పొలిమేర గట్టు దాటిన పెళ్లి ట్రాక్టర్‌.. మధ్యాహ్నం వేళకు తన   ముంగిటే చావు కేక పెట్టడంతో చినపరిమి గుండెలు వేదనతో        ముక్కలయ్యాయి.

తెనాలిరూరల్‌: వివాహ వేడుకకు వెళ్లిన వారి ఇంట విషాదం చోటుచేసుకుంది. చుండూరు మండలం చినపరిమి అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన యువతికి తెనాలి పట్టణ చినరావూరుకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. తెనాలిలో గురువారం వివాహం జరిగింది. వేడుకకు యువతి స్వగ్రామం నుంచి ట్రాక్టర్‌పై 50 మంది తెనాలి వచ్చారు. మధ్యాహ్నం భోజనాలు ముగించుకుని అదే ట్రాక్టరులో స్వగ్రామానికి బయలుదేరారు. మరో రెండు నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటారనగా.. చినపరిమి శివారులోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్‌ను తప్పించే క్రమంలో ట్రాక్టరు ట్రక్కు రోడ్డు పక్కన కాల్వలోకి బోల్తా పడింది.

దీంతో ఉన్నం పద్మ(35), గోరోజిన్నం అన్నమ్మ(40) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ గుత్తికొండ శ్యామ్‌ (13) మృతిచెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో దగ్గుబాటి హర్షవర్దన్‌(9), కట్టుపల్లి నిఖిల్‌(7) వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన  గోళ్ల నాగరాజమ్మ (34) గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె గురువారం రాత్రి మృతి చెందారు. గాయపడిన గుత్తికొండ శ్యామ్, టీ రమాదేవి, సౌజన్య, నాగలక్ష్మి, డీ వెంకటేశ్వర్లు, సంకీర్తన, ప్రకాశరావు, అద్భుత్, ఎస్తేర్‌రాణి, సుబ్బారావులను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిలో శ్యామ్‌ను  మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తీసుకెళ్లారు. 

మిన్నంటిన హాహాకారాలు..
ఘటనా స్థలం బాధితుల హాహాకారాలతో మిన్నంటింది. మృతి చెందిన పద్మ, అన్నమ్మ మృతదేహాలను తెనాలి వైద్యశాలకు తరలించారు. అడుతూ పాడుతూ ఉన్న తమ ముద్దుల చిన్నారులు విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రులు వేదనకు అంతులేకుండా ఉంది. వైద్యశాల వద్ద మృతుల కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.  

మృత్యు కౌగిలిలో అమ్మమ్మ, మనవడు..
చినపరిమికి చెందిన అన్నమ్మ తన కుమార్తె ఏసుమరియమ్మను నగరం మండలం కల్లిపాలేనికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం చేసింది. వీరికి కుమార్తె, నిఖిల్‌ సంతానం. నాలుగు రోజుల క్రితం నిఖిల్‌ తన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఆమెతో కలసి వివాహానికి వెళ్లాడు. తోటి పిల్లలతో అక్కడ ఆడుకుంటూ సందడి చేశాడు. తిరుగు ప్రయాణంలో అమ్మమ్మ వెంటే ట్రాక్టరులో కూర్చున్నాడు. బిడ్డకు ఎండ తగలకుండా అన్నమ్మ చీర కొంగును కప్పి రక్షణ కల్పిస్తూ వచ్చింది. అంతలోనే ప్రమాదం జరగడంతో అన్నమ్మ అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలపాలైన నిఖిల్‌ తెనాలి వైద్యశాలలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. 

తల్లడిల్లిన తల్లిదండ్రులు
అంబేడ్కర్‌నగర్‌కు చెందిన దగ్గుబాటి మురళి, నాగలక్ష్మిలకు ఇద్దరు మగ పిల్లలు. వ్యవసాయ కూలీలైన వీరు పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. చిన్నవాడైన హర్షవర్దన్‌ నాలుగో తరగతి చదువుతున్నాడు. చలాకీగా ఉండే వాడు. ట్రాక్టరు ప్రమాదంలో చిన్నారి విగత జీవిగా మారడంతో తల్లిదండ్రుల వేదన అంతులేకుండాపోయింది.  

ఎమ్మెల్యే మేరుగ పరామర్శ..
ప్రమాదం గురించి తెలుసుకున్న వేమూరు ఎమ్మెల్యే డాక్టర్‌ మేరుగ నాగార్జున తెనాలి వైద్యశాలకు చేరుకున్నారు.  బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.

వేగంగా మలుపు తిప్పడంతోనే ప్రమాదం: సౌజన్య, క్షతగాత్రురాలు
గ్రామంలో బస్టాప్‌కు సమీపంలో మలుపు వద్ద వేగంగా వెళ్లడంతోనే ప్రమాదం జరిగింది. ఎదురుగా మోటారుసైకిల్‌ వేగంగా వచ్చి ట్రాక్టర్‌కు తగిలింది. ఇంజిన్‌ మీద కూర్చున్న వారు దూకేశారు. ట్రక్కు బోల్తా కొట్టడంతో అందులో ఉన్న మాకు గాయాలయ్యాయి.

పరిమితికి మించిప్రయాణం 
ప్రమాద సమయంలో ట్రాక్టరు ట్రాలీలో పరిమితికి మించి ప్రయాణిస్తుండటం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో యజమాని ట్రాక్టర్‌ శ్రీనివాసరావు ట్రాక్టర్‌ నడుపుతున్నాడు. ట్రాక్టర్‌లో సుమారు 40 మంది ఉండటంతో మలుపు తిరిగేటప్పుడు అదుపు తప్పి బొల్తా కొట్టిందని స్థానికులు అంటున్నారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే అక్కడికి తెనాలి డీఎస్పీ కే శ్రీలక్ష్మి సిబ్బందితో చేరుకున్నారు. చుండూరు సీఐ బీ నరసింహారావు, ఎస్‌ఐలు రాజేష్, జీ పాపారావు, ఇతర సిబ్బంది, స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.

మరిన్ని వార్తలు