కునుకు తెచ్చిన ఘోర ప్రమాదం

29 Dec, 2018 11:52 IST|Sakshi
బోల్తా పడిన బస్సు, (ఇన్‌సెట్‌) మృతి చెందిన తిరుపాల్‌రెడ్డి

కల్వర్టును ఢీకొని అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

ఒకరు మృతి : 14 మందికి గాయాలు

మృతుడు, గాయపడిన వారంతా ‘అనంత’ వాసులు

శబరిమలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా పడటంతో ఒకరు మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఈ సంఘటన మదనపల్లె బైపాస్‌రోడ్డులో చోటుచేసుకుంది.

చిత్తూరు , మదనపల్లె సిటీ : అనంతపురం జిల్లా ఓబుళదేవలచెరువు (ఓడిసి), గోరంట్ల, నల్లమాడ మండలాలకు చెందిన 18 మంది అయ్యప్ప భక్తులతో పాటు వారి కుటుంబసభ్యులు 27 మంది శబరిమలకు ప్రైవేటు బస్సులో ఈనెల 20న ఓడిసి నుంచి బయలుదేరి వెళ్లారు. 22న అక్కడ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం కన్యాకుమారి, రామేశ్వరంలోని ఆలయాలను సందర్శించారు. గురువారం వేలూరు సమీపంలోని స్వర్ణదేవాలయం దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో ఘోర ప్రమాదానికి గురయ్యారు. మదనపల్లె బైపాస్‌రోడ్డులోని ఆర్టీఓ కార్యాలయం వద్దకు రాగానే బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీకొని బోల్తాపడింది. అప్పుడు సమయం ఉదయం 3.30 గంటలు. బస్సు ముందరి అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. భక్తుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. బస్సులో ప్రయాణిస్తున్న గోర్లంట మండలం పాలసముద్రం పంచాయతీ లింగొల్లపల్లెకు చెందిన వంటమాస్టర్‌ సిద్ధిరెడ్డిగారి తిరుపాల్‌రెడ్డి (40) రెండు కాళ్లు విరిగిపోయాయి. అలాగే రామాంజులమ్మ (40), చంద్ర (30), సాలమ్మ (70) బాలనాగమ్మ(70), లలితమ్మ(70), ఆంజనమ్మ (65), నాగలక్ష్మి(62), వెంకట్రమణప్ప(65), లావణమ్మ(46), ఆదిలక్ష్మమ్మ (65), వెంకటశివారెడ్డి (65), సవరమ్మ (45), వెంకటలక్ష్మి(70), బి.రమణప్ప(55) తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే రూరల్‌ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తిరుపాల్‌రెడ్డిని మెరుగైన చికిత్స నిమిత్తం పుట్టపర్తిలోని సత్యసాయి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. గాయపడిన వారిలో పలువురిని 108లో మదనపల్లె జిల్లా వైద్యశాలకు తరలించి చికిత్స చేశారు. స్వల్పంగా గాయపడిన వారిని పోలీసులు మరో బస్సులో స్వగ్రామాలకు తరలించారు. రూరల్‌ పోలీçసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఐచర్‌ వ్యాను ఢీకొని మోటార్‌ సైక్లిస్టు..
పీలేరు రూరల్‌ : ఐచర్‌ వ్యాను ఢీకొనడంతో మోటార్‌ సైక్లిస్టు దుర్మరణం చెందిన సంఘటన  మండలంలో చోటు చేసుకుంది. వివరాలు.. సో మల మండలం నెల్లిమందకు చెందిన ఓంకార్‌ (23) మోటార్‌ సైకిల్‌లో పీలేరు నుంచి వాల్మీకిపురానికి బయలుదేరాడు. కలికిరి నుంచి పీలేరుకు ఎదురుగా వస్తున్న ఐచర్‌ వాహనం జంగంపల్లె అతడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓంకార్‌ను చికిత్స నిమిత్తం 108లో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ ఓంకార్‌ మృతి చెందాడు. పీలేరు ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైలు ఢీకొని వైఎస్సార్‌ జిల్లా వాసి...
పుత్తూరు: రైలు ఢీకొని ఒకరు మృతి చెందిన సం ఘటన పుత్తూరులో చోటుచేసుకుంది. జీఆర్పీ హెడ్‌ కానిస్టేబుల్‌ శివప్రసాద్‌ కథనం.. వైఎస్సార్‌ కడప జిల్లా సింహాద్రిపురం మండలం చెర్లోపల్లెకు చెందిన ఎస్‌.లక్ష్మీనారాయణ (33)కొన్నేళ్లుగా కూలీ ప నులు చేసుకుంటూ బొజ్జనెత్తంలో నివాసముంటున్నా డు. శుక్రవారం ఉదయం అతడు పుత్తూరు– తడుకు రైల్వే ట్రాక్‌ దాటుతుండగా రైలు  ఢీకొంది. లక్ష్మీనారా యణ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హెడ్‌కానిస్టేబుల్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని విశ్రాంత హెచ్‌ఎం..
కార్వేటినగరం: గుర్తుతెలియని వాహనం ఢీకొని విశ్రాంత  ప్రధానోపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన  మండలంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు  చేసుకుంది. స్థానికుల కథనం..ముస్లిం కాలనీకి చెందిన రిటైర్డ్‌ హెచ్‌ఎం పీ.ఎండీ షఫీఉల్లాఖాన్‌(72) సొంత పనుల నిమిత్తం  ద్విచక్రవాహనంలో  పుత్తూరుకు వెళ్లి  స్వగ్రామానికి తిరిగి వస్తుండగా,  సురేంద్రనగరం పెద్ద కనుమ వద్ద గుర్తు తెలియని వాహనం  వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న  కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని భోరున విలపించారు. మృతదేహాన్ని ఇంటికి తరలించారు. గతంలో ఏపీటీఎఫ్‌ ఉపాధ్యాయ సంఘంలో  నాయకుడిగా,  ప్రస్తుతం మండల  విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘానికి మండల అ«ధ్యక్షుడిగా షఫీ వ్యవహరిస్తున్నారు. పలువురు పెన్షనర్ల సంఘ నాయకులు ఆయన భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

త్వరగా వచ్చేయ్‌..మరో పార్టీ ఉంది
‘త్వరగా..త్వరగా వచ్చేయ్‌..మరో పార్టీ ఉంది’ అన్న బస్సు ఓనర్‌ మాటలే కొంపముంచాయి. వాస్తవానికి తాము గోల్డెన్‌ టెంపుల్‌ దర్శించుకున్న అనంతరం కాణిపాకం దేవాలయాన్ని సందర్శించాల్సి ఉందని, అయితే బస్సు ఓనర్‌ అర్జెంట్‌గా రమ్మన్నాడని, మరో పార్టీని తీసుకెళ్లాలని ఆదేశించాడని, అందుకే కాణిపాకానికి తీసుకెళ్లలేనంటూ డ్రైవర్‌ నేరుగా అనంతబాట పట్టాడని భక్తులు చెప్పారు. అంతేకాకుండా సుదీర్ఘమైన ప్రయాణానికి ఇద్దరు డ్రైవర్లకు బదులు ఒక్కడినే పంపడం, ఏకధాటిగా ఒకడే రేయింబవళ్లూ బస్సు నడుపుతుండడం.. నిద్రలేక కునుకుతీయడం వలనే ఈ ఘోర ప్రమాదం సంభవించిందని భక్తులు ‘సాక్షి’కి చెప్పారు.

మరిన్ని వార్తలు