నెత్తురోడిన రహదారి

2 May, 2019 10:28 IST|Sakshi
ధ్వంసమైన ఇన్నోవా కారు

చిత్రదుర్గం జిల్లాలో కారు బోల్తా

ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు మృతి  

ముగ్గురికి తీవ్ర గాయాలు  

బాధితులు బెంగళూరువాసులు  

సాక్షి, బళ్లారి: చిత్రదుర్గం జిల్లా హిరియూరు తాలూకా మేటికుర్కె సమీపంలో బుధవారం సంభవిం చిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చిన్నారులతో పాటు ఐదుమంది దుర్మరణం పాలయ్యారు. బెంగళూరుకు చెందిన తాయమ్మ (50), లత (26), వీణికా (3), జాహ్నవి (3), సుస్మిత(12)లు ఇన్నోవా కారులో వెళ్తుండగా మేటికుర్కె వద్ద ఎదురుగా వస్తున్న లారీని తప్పించేందుకు ప్రయత్నిస్తూ రోడ్డు డివైడర్‌ను ఇన్నోవా ఢీకొట్టింది. కారు బోల్తా పడటంతో ఐదు మంది అక్కడికక్కడే మృతి చెందారు. కారు తుక్కుతుక్కయింది. ఆ సమయంలో మృతురాలు లత భర్త ప్రకాశ్‌ కారు డ్రైవింగ్‌ చేస్తున్నారు. ఆయనకు తీవ్ర గాయాలు కాగా హిరియూరు ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం 8 మంది ఉన్నట్లు తెలిసింది. మిగతా ఇద్దరికి కూడా గాయాలయ్యాయి.  

భద్రావతి నుంచి తిరిగి వస్తుండగా
 మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారే. శివమొగ్గ జిల్లా భద్రావతిలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి బెంగళూరుకు వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలిసి బంధువులు, స్నేహితులు చేరుకున్నారు. వారి ఆర్తనాదాలు మిన్నంటాయి. ఘటన స్థలంలో శవాలు చల్లాచెదురుగా పడటంతో జాతీయ రహదారి రక్త సిక్తమైంది. ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే హిరియూరు పోలీసులతో పాటు డీఎస్పీ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై హిరియూరు గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు