రక్తమోడిన రహదారులు

15 Dec, 2018 12:55 IST|Sakshi
ప్రమాదంలో బోల్తాపడిన ట్రాక్టర్‌

వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం

పైపాడులో ట్రాక్టర్‌ బోల్తాపడి ఇద్దరు  

మరికల్‌లో యువకుడు

గంట్రావ్‌పల్లిలో బాలుడు ఆటో ఢీకొని మహిళ  

మరో 9 మందికి గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం

శాంతినగర్‌ (అలంపూర్‌): వేగంగా వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడటంతో ఇద్దరు మృతిచెందిన సంఘటన వడ్డేపల్లి మండలం పైపాడు శివారులో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలిలా.. మెన్నిపాడు గ్రామానికి చెందిన బోయ నారాయణకు వడ్డేపల్లి మండలం జిల్లెడిదిన్నె గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. వివాహం గురించి మాట్లాడిన అనంతరం తిరుగు ప్రయాణమవ్వగా అలంపూర్‌–రాయచూర్‌ ప్రధాన రహదారిపై పైపాడు స్టేజీ సమీపంలోకి రాగానే వాహన వేగం అతిగా ఉండటంతో అదుపుతప్పింది. సమీపంలోని పంట పొలంలోకి దూసుకుళ్లింది. డ్రైవర్‌ నాగేష్‌ అప్రమత్తమై చేసిన ప్రయత్నం విఫలమై ఇంజన్, ట్రాలీ బోల్తాపడింది. ప్రమాదంలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న 20 మంది పడిపోయారు. వారిలో బోయ మద్దిలేటి (55), బోయ వెంకటేశ్వరమ్మ (30) ట్రాలీ కింద పడటంతో అక్కడికక్కడే మృతిచెందారు. అలాగే తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ నాగేష్, అతని కొడుకు మధు, శేషమ్మ, రంగమ్మ, వెంకటేశ్వరమ్మలకు సైతం తీవ్ర గాయాలు తగిలాయి. స్థానికులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో అసువులు బాసిన బోయ వెంకటేశ్వరమ్మ, మద్దిలేటి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అలంపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై  కేసు నమోదు చేసినట్లు శాంతినగర్‌ ఎస్‌ఐ మహేందర్‌ తెలిపారు.

మరో ప్రమాదంలో యువకుడు
తిమ్మాజీపేట (నాగర్‌కర్నూల్‌): మండలంలోని మరికల్‌ గ్రామంలో శుక్రవారం సాయంత్రం ట్రాక్టర్‌ బోల్తా పడిన సంఘటనలో వడ్డె సురేష్‌(19) అనే యువకుడు మృతిచెందాడు. వ్యవసాయ పొలంలో ట్రాక్టర్‌ ద్వారా కరిగెట చేస్తుండగా ట్రాక్టర్‌ తిరగడడి బోల్తా పడింది. ట్రాక్టర్‌ మీద పడటంతో సురేష్‌ తీవ్రంగా గాయపడ్డారు. చుట్టుపక్క గ్రామాల రైతులు గమనించి బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రాణాలు వదిలారు. ఈ సంఘటనపై మృతుడి తండ్రి భీమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి  పోస్టుమార్టం నిర్వహించి కుటుం బ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు.  

ఆటో, బైకు ఢీకొన్న సంఘటనలో..
మహబూబ్‌నగర్‌ క్రైం : ద్విచక్ర వాహనం, ఆటో ఢీకొన్న సంఘటనలో మహిళ మృతిచెందింది. హన్వాడ మండలం చిరుమల్‌కుచ్చతండాకు చెందిన కృష్ణయ్య, అతని భార్య వెంకటమ్మ (65) గురువారం సాయంత్రం జిల్లా కేంద్రం నుంచి స్వగ్రామానికి బయల్దేరారు. పట్టణంలోని టీడీగుట్ట వద్దకు రాగానే హన్వాడ వైపు నుంచి మహబూబ్‌నగర్‌ వస్తున్న ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో వెంకటమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం స్థానికులు మొదట జనరల్‌ ఆస్పత్రి తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహబూబ్‌నగర్‌ వన్‌టౌన్‌ సీఐ రాజేష్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు
భూత్పూర్‌: మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి (బి) వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హెడ్‌కానిస్టేబుల్‌ సుదర్శన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్‌కు చెందిన ఓ కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు వెళ్తుండగా జాతీయ రహదారిపై టైర్‌ పంచర్‌ కావడంతో డ్రైవర్‌ పక్కన నిలిపాడు. కారులో ఉన్న కల్పన అనే మహిళ రోడ్డుపై నిల్చొని ఉండగా అదే సమయంలో కర్నూల్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న యువకులు ఢీ కొట్టి బోల్తాపడ్డారు. దీంతో కల్పన ఎడమ చేయి, కుడి కాలు విరిగిపోగా, మోటర్‌ సైకిల్‌పై ఉన్న మణికంఠ, శ్రీనులకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. గాయపిన ముగ్గురిని 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. మణికంఠ, శ్రీను పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఇదిలాఉండగా ఢీ కొట్టిన ఇద్దరు యువకులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కాకినాడ వాసులుగా గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ సుదర్శన్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు