నెత్తురోడిన రహదారులు

12 Jul, 2019 08:53 IST|Sakshi
ఉదయ్‌కిరణ్‌ (ఫైల్‌) దినేష్‌రెడ్డి(ఫైల్‌)

వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు వ్యక్తుల దుర్మరణం

త్రిబుల్‌ రైడింగ్‌ కారణంగా రెండు ఘటనలు

మరో ముగ్గురికి గాయాలు

వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఐదు రోడ్డు ప్రమాదాల్లో ఐదురుగు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పంజగుట్ట పరిధిలో బైక్‌ అదుపుతప్పి ఓ మైనర్‌ మృతిచెందగా, మేడ్చల్‌ ప్రాం తంలో బైక్‌ను లారీ ఢీకొనడంతో ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిదుర్మరణం పాలయ్యాడు. జీడిమెట్లలో అతివేగం కారణంగా బైక్‌ అదుపుతప్పి ఓ యువకుడు మృతి చెందాడు. శామీర్‌పేట్‌ ప్రాంతంలో కారు ఢీకొని ఓ ఉపాధ్యాయుడు మృతి చెందగా, గుర్తుతెలియని వాహనం ఢీకొని మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు.

వివరాల్లోకి వెళితే..
లారీ ఢీకొని ఇంజినీరింగ్‌ విద్యార్థి దుర్మరణం

మేడ్చల్‌రూరల్‌: లారీ ఢీకొనడంతో సీఎంఆర్‌ కళాశాలకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్ధి మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ గణేశ్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భూపాలపల్లి జిల్లా, తాడిచెర్ల గ్రామానికి చెందిన చెన్నూరి ఉదయ్‌కిరణ్‌(19) మేడ్చల్‌ మండల పరిధిలోని సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో  ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం రాత్రి అతను టీ తాగేందుకు స్నేహితులు సూర్యకిరణ్‌రెడ్డి, రేవంత్‌లతో కలిసి బైక్‌పై మేడ్చల్‌ చెక్‌పోస్ట్‌కు వెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చేందుకు చెక్‌పోస్ట్‌ వద్ద  యూ టర్న్‌ తీసుకుంటుండగా తూప్రాన్‌ వెళ్తున్న లారీ వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌ నడుపుతున్న ఉదయ్‌కిరణ్‌  తలపై నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మేడ్చల్‌ పోలీసులు, 108 సిబ్బంది  క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఉదయ్‌కిరణ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు అందించారు. మృతుడి తండ్రి దేవదానం ఫిర్యాదు మేరకు   కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తు తెలియని వాహనం ఢీ కొని..
శామీర్‌పేట్‌: గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు మండల పరిధిలోని తుర్కపల్లి గ్రామానికి చెందిన మహ్మద్‌ హజీఖాన్‌(55), మజీద్‌ కు వెళ్లేందుకు గ్రామంలోని హైదరాబాద్‌–కరీంనగర్‌ రహదారి దాటుతుండగా సిద్దిపేట వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రాణం తీసిన వేగం
జీడిమెట్ల: అతివేగం ఓ యువకుడి ప్రాణాలు బలిగొన్న ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమణారెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జగద్గిరిగుట్ట పాపిరెడ్డినగర్‌కు చెందిన లక్ష్మారెడ్డి కుమారుడు దినేష్‌ రెడ్డి (23) ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం రాత్రి అతను తన స్నేహితులు రాజేష్, సాయిరాజ్‌తో కలిసి మరో స్నేహితుడు భరత్‌ పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యాడు. అనంతరం ముగ్గురు కలిసి బైక్‌పై షాపూర్‌నగర్‌లోని ఓ హోటల్‌ కు వెళ్లి తిరిగి వస్తుండగా హెచ్‌ఎంటీ రోడ్డులో బైక్‌ అదుపు తప్పి కింద పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దినేష్‌రెడ్డిని ఆస్పత్రికి తీసుకు వెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. మృతుని తండ్రి లక్ష్మారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అతివేగమే కారణం..
స్నేహితులతో కలిసి బైక్‌పై వెళ్తున్న దినేష్‌ రెడ్డి పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనం సైరన్‌ మోగించడంతో కంగారు పడి వారిని తప్పించుకునేందుకు బైక్‌ వేగం పెంచడంతో అదుపు తప్పిందని దినేష్‌రెడ్డి స్నేహితులు తెలిపారు.  

బైక్‌ అదుపుతప్పి బాలుడి మృతి
పంజగుట్ట: రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడిన సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎర్రగడ్డకు చెందిన సాయి కృష్ణ (16) ఎస్‌ఆర్‌ నగర్‌ ఆదర్శ్‌ జూనియర్‌ కాలేజీలో సీఈసీ చదువుతున్నాడు. బుధవారం రాత్రి అతను స్నేహితుడి ఇంట్లో శుభకార్యానికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి స్నేహితులు గోగుల ఆదిత్య, ప్రశాంత్‌తో కలిసి బైక్‌పై బయటికి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున పంజగుట్ట నుండి ఖైరతాబాద్‌ వైపు వెళుతుండగా ఆస్కీ సమీపంలోని మలుపు వద్ద బైక్‌ అదుపుతప్పింది. దీంతో వాహనం నడుపుతున్న గోగుల ఆదిత్య, వెనక కూర్చున్న ప్రశాంత్‌  కిందకు దూకగా, మధ్యలో ఉన్న సాయి కృష్ణ వాహనంతో సహా వెనుక వస్తున్న లారీ కిందకు వెళ్లాడు. తీవ్రంగా గాయపడిన వారు ముగ్గురినీ పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సాయికృష్ణ మృతి చెందాడు. మిగిలిన ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. సాయి లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యమే తన కుమారుడికి మృతికి కారణమని  కృష్ణ తండ్రి శంకర్‌ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.   కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ సి.హెచ్‌.వెంకన్నను అదుపులోకి తీసుకున్నారు.  

కారు ఢీకొని ఉపాధ్యాయుడి దుర్మరణం
మరో ఉపాధ్యాయుడి పరిస్థితి విషమం

శామీర్‌పేట్‌:  కారు ఢీకొనడంతో ఓ ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఉపాధ్యాయుడికి తీవ్ర గాయాలైన సంఘటన శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నేరెడ్‌మెట్‌లో ఉంటున్న నరేందర్‌(57), చంద్రశేఖర్‌ శామీర్‌పేట మండలం, అలియాబాద్‌లోని ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. గురువారం స్కూల్‌ నుంచి ఇంటికి తిరిగి వెళుతుండగా హకీంపేట సమీపంలో హైదరాబాద్‌–కరీంనగర్‌ జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న ఇన్నోవా కారు వారి బైక్‌ను ఢీకొనడంతో నరేందర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.  చంద్రశేఖర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్‌పేట పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు