నెత్తుటి ధారలు

1 Aug, 2019 10:36 IST|Sakshi
శ్రీదేవి మృతదేహం , గాయపడిన కేదారినాథ్‌

వేర్వేరు ఘటనల్లో ఐదుగురి దుర్మరణం

పుట్టిన రోజు షాపింగ్‌కు వెళ్లి మహిళ

బంధువులకు వీడ్కోలు పలికేందుకు వెళ్లి ముగ్గురు యువకులు  

కాలేజీ బస్సు కింద పడి విద్యార్థి మృతి

కుత్బుల్లాపూర్‌: జాతీయ రహదారి రక్తసిక్తమైంది. నాలుగు గంటల వ్యవధిలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఏకంగా నలుగురు మృత్యువాత పడ్డారు. పేట్‌బషీరాబాద్‌ సీఐ మహేశ్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దూలపల్లి ప్రాంతానికి చెందిన ఉదయగిరి శ్రీదేవి(28), సమీప బంధువు కేదారినాథ్‌తో కలిసి మంగళవారం రాత్రి బైక్‌పై సుచిత్ర నుంచి కొంపల్లి వైపు సర్వీస్‌ రోడ్డులో వస్తుండగా జాతీయ రహదారిపై వెళ్తున్న ఇన్నోవా కారు అదుపు తప్పి పార్క్‌ చేసి ఉన్న కార్లు, వాహనాలను ఢీకొడుతూ భీభత్సం సృష్టించింది. అదే సమయంలో అటుగా వస్తున్న వీరి బైక్‌ను ఢీకొనడంతో శ్రీదేవికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను  ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కేథరినాథ్‌ స్పల్ప గాయాలతో బయట పడ్డాడు. ఆగస్టు 1న  శ్రీదేవి పుట్టినరోజు కావడంతో షాపింగ్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా మృత్యువు కబళించింది. మృతురాలికి భర్త, కుమార్తె(1.5) ఉన్నారు. కాగా ప్రమాదానికి కారణమైన కారును ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.  

బంధువులను రైలెక్కించేందుకు వెళుతూ ..
బంధువులను రైలు ఎక్కించేందుకు వెళుతున్న ముగ్గురు యువకులు లారీని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కొంపల్లి ఫ్లైవర్‌ రాజరాజేశ్వరీ దేవాలయం వద్ద మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. రాజస్థాన్‌కు చెందిన ఇందర్‌చంద్‌(22), విక్రమ్‌ సింగ్‌(22), దినేశ్‌(22) నగరంలోని వివిధ బేకరీల్లో పని చేస్తున్నారు. మంగళవారం రాత్రి వారి బంధువులు రాజస్థాన్‌ వెళుతుండటంతో వారికి సెండాఫ్‌ ఇచ్చేందుకు ముగ్గురు కలిసి ఒకే బైక్‌పై రైల్వే స్టేషన్‌కు బయలుదేరారు. మేడ్చల్‌ నుంచి సుచిత్ర వైపు  వెళుతున్న వీరు యూటర్న్‌ తీసుకుని దేవరయాంజల్‌ వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సీఐ మహేశ్‌ కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

కాలేజీ బస్సుకింద పడి విద్యార్థి..
దుండిగల్‌: మరో రెండు నిముషాల్లో కాలేజీకి చేరాల్సిన విద్యార్థి అదే కళాశాలకు చెందిన బస్సు కింద పడి మృత్యువాత పడిన సంఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడపజిల్లా, రామాపురం మండలం, ఏకులపల్లి గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి కుటుంబంతో సహా 20 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి చింతల్‌లో ఉంటూ ప్రైవేట్‌ పరిశ్రమలో పని చేస్తున్నాడు. ఇతనికి భార్య  సువర్ణ, కుమారుడు వీరేష్‌రెడ్డి(20) ఉన్నారు.  వీరేశ్‌రెడ్డి దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలలో బీటెక్‌ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం స్నేహితుడు ప్రవీణ్‌తో కలిసి  బైక్‌పై స్నేహితుడు కళాశాలకు బయలు దేరాడు. కాలేజీ సమీపంలోని ఆర్చ్‌ వద్ద స్పీడ్‌ బ్రేకర్‌ ఉండటంతో వాహనాన్ని స్లో చేశాడు. ఈ క్రమంలో వెనక నుంచి వేగంగా వచ్చిన అదే కళాశాలకు చెందిన బస్సు వీరి బైక్‌ను ఢీకొట్టింది. కింద పడిన వీరేష్‌రెడ్డి మీదుగా బస్సు చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న ప్రవీణ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి బంధువు రంగారెడ్డి  ఫిర్యాదు మేరకు దుండిగల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు