ప్రమాదాల్లో ఐదుగురి మృతి

28 Dec, 2018 12:27 IST|Sakshi
ట్రాక్టర్‌ ఢీకొన్న లారీ, సగానికి తెగిపడ్డ ట్రాక్టర్‌

ట్రాక్టర్‌ను లారీ ఢీకొని చిత్తూరు– వైఎస్సార్‌ జిల్లా సరిహద్దులో ఇద్దరు తిప్పిరెడ్డిగారిపల్లె కూలీలు

కర్ణాటకలో రైళ్లు ఢీకొని ఇద్దరు కీమెన్లు

కురబలకోటలో రైలు కింద పడి గుర్తు తెలియని యువకుడు

కలకడ ఘటనలో మరో నలుగురు కూలీలకు తీవ్రగాయాలు

జిల్లాలో, జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చోటుచేసుకున్న వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీకొనడంతో ఇద్దరు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వరదాపురం రైల్వేస్టేషన్‌ సమీపంలో రైళ్లు ఢీకొని ఇద్దరు కీమెన్లు దుర్మరణం చెందారు. దట్టంగా కురుస్తున్న మంచులో రైళ్లు కనిపించక వారు మృత్యువాత పడ్డారు.

చిత్తూరు, కలకడ : ట్రాక్టర్‌ను లారీ ఢీకొన్న దుర్ఘటనలో మండలానికి చెందిన ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన చిత్తూరు–వైఎస్సార్‌ కడప జిల్లా సరిహద్దులో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం.. తిప్పిరెడ్డిగారిపల్లెకు చెందిన ఆరుగురు వ్యక్తులు గురువారం ఉదయం 7గంటల సమయంలో ఇటుకల కోసం ట్రాక్టర్‌లో కలకడకు బయలుదేరి వస్తుండగా పీలేరు నుంచి రాయచోటి వైపు వెళుతున్న కెఎ 01 ఎజె 4424 నంబరు గల లారీ జిల్లా సరిహద్దులో ఢీకొంది. ఈ ప్రమాదంలో తిప్పిరెడ్డిగారిపల్లె వాసి చిన్నకోట్ల వెంకట్రమణ (45) అక్కడికక్కడే మృతి చెందాడు.

తీవ్రంగా గాయపడ్డ ఎస్‌.మునాఫ్‌ (23), రఫీ (17), లక్ష్మీపతి తదితరులను 108లో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మునాఫ్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. రఫీ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తిరుపతికి రెఫర్‌ చేశారు. కడప జిల్లా సంబేపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద ఘటనతో తిప్పిగారిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి.

రైళ్లు ఢీకొని ఇద్దరు కీమెన్లు..–మంచు తెచ్చిన ముప్పు
గుడుపల్లె/కుప్పం రూరల్‌: రైళ్లు ఢీకొని ఇద్దరు రైల్వే కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన గుడుపల్లె సమీపంలోని సరిహద్దు ప్రాంతమైన కర్ణాటక రాష్ట్రం వరదాపురం రైల్వేస్టేషన్‌ సమీపాన గురువారం చోటుచేసుకుంది.  బంగారుపేట రైల్వే పోలీసుల కథనం.. కీమెన్లుగా రామస్వామి (24) బెంగళూరు ట్రాక్‌ మార్గంలో,  రాజప్ప (26) చెన్నై మార్గంలో విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం 4 గంటల సమయంలో ఇద్దరు వరదాపురం రైల్వే స్టేషన్‌ సమీపంలోకి రాగానే రెండు పట్టాలపై రైళ్లు వీరిని ఢీకొన్నాయి. దీంతో రామస్వామి, రాజప్ప అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రామస్వామి శాంతిపురం మండలం, సీ.బండపల్లెకు చెందిన వ్యక్తి కాగా, రాజప్ప మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా రైల్వే పోలీసులు గుర్తించారు. రామస్వామి కాంట్రాక్టుపై పని చేస్తుండగా, రాజప్ప రెగ్యులర్‌ ఉద్యోగి. ఉదయం మంచులో రైళ్లను గమనించకపోవడం వల్లనే ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం వీరి  మృతదేహాలను బంగారుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బంగారుపేట రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రైలు కింద పడి యువకుడు..
కురబలకోట : రైలు కింద పడి గుర్తు తెలియని యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం మధ్యాహ్నం కురబలకోట రైల్వేస్టేషన్‌ దగ్గర చోటుచేసుకుంది. పట్టాల మధ్యనే మృతదేహం పడి ఉంది. కదిరి రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చినట్లు రైల్వే స్టేషన్‌ మాస్టర్‌ Ðð తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిందా, లేదా అత్మహత్యా? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

మరిన్ని వార్తలు