ఐదుగురిని బలిగొన్న గ్రానైట్‌ లారీ 

10 Feb, 2020 03:30 IST|Sakshi
క్యాబిన్‌లోనే మృతి చెందిన అంజయ్య

కరీంనగర్‌ జిల్లా కురిక్యాలలో ఘటన

గంగాధర(చొప్పదండి): గ్రానైట్‌ లారీ అతివేగం ఐదుగురి ప్రాణాలను బలిగొంది. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలో శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. కొడిమ్యాల మండలం లోని గౌరాపూర్‌ గ్రామానికి చెందిన మ్యాక నర్సయ్య(55) కుమారుడు మ్యాక బాబు ఇంటివద్ద బైక్‌ పైనుంచి పడ్డాడు. తలకు గాయాలు కావడంతో స్థానికంగా ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు నర్సయ్య తన సమీప బంధువు, పూడూరు గ్రామానికి చెందిన వాహనం యజమాని గడ్డం అంజయ్య(47)ను సంప్రదించాడు. అంజ య్య కరీంనగర్‌ రావడానికి అంగీకరించడంతో బాబు(27), నర్సయ్య, బంధువైన మ్యాక బాణయ్య(60) కరీంనగర్‌ వెళ్లారు. ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. చికిత్స అనంతరం కరీంనగర్‌లో పని చేసే మరో బంధువు మ్యాక శేఖర్‌(27)తో కలసి స్వగ్రామానికి బయల్దేరారు.

ఎదురొచ్చిన మృత్యువు..
వీరు ప్రయాణిస్తున్న వాహనం గంగాధర మండలం కురిక్యాల సమీపంలోకి రాగానే జగిత్యాల నుంచి కరీంనగర్‌వైపు వెళుతున్న గ్రానైట్‌ లారీ వేగంగా వచ్చి టాటా మ్యాజిక్‌ను ఢీకొట్టడంతో డ్రైవర్‌ అంజయ్య నర్సయ్య, శేఖర్, బాబు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. బాణయ్యను  ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. సమాచారం అందుకున్న గంగాధర ఎస్సై వివేక్‌ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్‌డీవో ఆనంద్‌కుమార్‌ మృతుల కుటుంబాలకు పరిహారం అందిస్తామన్నారు.

వివిధ ప్రమాదాల్లో 37 మందికి గాయాలు
జనగామ శివారులో జాతీయ రహదారిపై నెల్లుట్ల బైపాస్‌ క్రాసింగ్‌ సమీపంలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 37 మంది స్వల్పంగా గాయపడ్డారు. ములుగు జిల్లాలో మేడారం మహాజాతరకు వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో స్వగ్రామాలకు వెళ్తున్న క్రమంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు