ఐదు నెలల చిన్నారి కిడ్నాప్‌

2 Oct, 2017 19:30 IST|Sakshi
కిడ్నాప్‌నకు గురైన చిన్నారి షైనా , చిన్నారిని తీసుకొని పరారైన హంస

ఓ వ్యక్తితో కలిసి చిన్నారిని తీసుకొని పరారైన మహిళ

తల్లిదండ్రులకు భారమై.. పరాయి మహిళ సంరక్షణలో పెరుగుతున్న చిన్నారి

పాపకు దుస్తులు కొనిపెడతానంటూ నమ్మించి ఎత్తుకెళ్లిన వైనం

రంగారెడ్డి, శంషాబాద్‌ రూరల్‌(రాజేంద్రనగర్‌) : రక్తం పంచుకు పుట్టిన ఆ చిన్నారి తల్లిదండ్రులకు భారమైంది.. పుట్టిన 10 రోజులకే పరాయి మహిళ ఒడికి చేరింది.. అక్కడి నుంచి మరో తల్లి ఒడికి.. ఈ క్రమంలోనే ఓ మహిళ ఆ చిన్నారిని తీసుకొని ఓ వ్యక్తితో కలిసి పరారైంది.. రెండు రోజులుగా పోలీసులు చిన్నారి జాడ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మహేశ్వరం మండలం నాగారం పంచాయతీ అనుబంధ గ్రామం పెద్దతండాకు చెందిన కేతావత్‌ మోహన్, జ్యోతి దంపతులకు మే 24న కూతురు పుట్టింది. కూలి పని చేసుకునే ఈ దంపతులకు అప్పటికే ఓ కూతురు ఉండగా.. రెండో సారి పుట్టిన కూతురును పోషించే స్తోమత, ఆసక్తి లేకుండా పోయాయి. ఈ క్రమంలో జ్యోతి తండ్రి హన్మ కూరగాయలు అమ్మడానికి శంషాబాద్‌ మార్కెట్‌కు వచ్చే తరుణంలో అక్కడ కూరగాయాల వ్యాపారం చేసే చారి నగర్‌ వాసి రాణితో పరిచయం ఏర్పడింది. తన కూతురు జ్యోతికి పుట్టిన చిన్నారిని ఎవరైనా పెంచుకుంటే ఇచ్చేస్తామని చెప్పాడు. దీంతో పది రోజులకు ఆ చిన్నారిని రాణికి ఇచ్చేశారు. ఇదిలా ఉండగా.. పట్టణంలోని కాపుగడ్డ బస్తీలో నివాసముండే రాణి అమ్మగారి ఇంటి పక్కన పద్మ అనే మహిళ అమ్మగారు ఇల్లు ఉంది. మొయినాబాద్‌ మండలం అమ్డాపూర్‌లో నివాసముండే పద్మకు పిల్లలు లేరు.

దీంతో ఈ చిన్నారిని పెంచుకుంటానని చెప్పడంతో రాణి ఆ పాపను వారికి ఇచ్చేసింది. కాపుగడ్డలోనే తల్లిగారింటి వద్ద ఉంటూ నెల రోజుల పాటు పద్మ ఆ చిన్నారి ఆలనా పాలనా చూసుకుంది. అయితే పద్మ ఆరోగ్యం, మానసిక ప్రవర్తన బాగా లేకపోవడంతో చిన్నారిని సాకడానికి వీలుకాదని నెల కిందట రాణికి ఇచ్చేశారు. అçప్పటి నుంచి రాణి వద్దనే ఉంటున్న చిన్నారికి షైని అనే పేరు పెట్టి బాగోగులు చూస్తుంది. దసరా పండగ సందర్భంగా రాణి చిన్నారిని తీసుకుని వారం కిందట సిద్దంతిలోని తన అక్క విజయం ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో నందిగామ మండలం మేకగూడలో ఉండే పద్మ చెల్లెలు హంసకు రాణితో ఉన్న పరిచయంతో  సెప్టెంబరు 29న సిద్దంతిలోని విజయం ఇంటికి వచ్చింది. పాపకు పండగ కోసం కొత్త దుస్తులు ఇప్పిస్తానని చెప్పగా.. విజయ తన కూతురు హైనాను తోడుగా ఇచ్చి స్కూటీపై పంపించింది. కొద్ది దూరం వెళ్లగానే వర్షం పడుతుండడంతో.. ఇక్కడ రోడ్డుపై అన్ని గుంతలు ఉన్నాయి.. స్కూటీపై వెళ్లడం కష్టం కదా.. నేను పాపను ఎత్తుకుని వస్తాను.. నీవు వెళ్లి షాపు వద్ద నిలబడు అని హంస చెప్పడంతో హైనా వీరిని వదిలేసి షాపు వద్దకు వెళ్లింది. ఎంతకీ హంస షాపు వద్దకు రాకపోవడంతో ఇంటికి వచ్చి విషయం చెప్పింది. వెంటనే వారు ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కిడ్నాప్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

నగలు, నగదు మాయం..
చిన్నారితో పరారైన హంస తన అత్తగారింట్లో నుంచి 25 తులాల బంగారు నగలు, రూ.25వేల నగదును తీసుకొన్ని వెళ్లిందని ఆమె భర్త అంజయ్య చెబుతున్నాడు. తన కూతురు పెళ్లి కోసం భూమి అమ్మి నగలు కొన్నామని, దసరా బోనస్‌గా వచ్చిన డబ్బులను ఇంట్లోని అల్మారాలో భద్రపర్చానని చెప్పాడు. తనకు తెలియకుండా భార్య ఇంట్లో నుంచి నగలు, నగదు తీసుకుని వెళ్లిపోయిందని అంజయ్య పోలీసులకు వివరించాడు. మరో వైపు బుద్వేల్‌కు చెందిన చంద్రకాంత్‌ అనే వ్యక్తితో కలిసి చిన్నారిని తీసుకుని హంస వెళ్లిపోయినట్లు తెలిసింది.

ఫోన్‌లు స్విచ్‌ఆఫ్‌..
చిన్నారిని తీసుకెళ్లిన హంస, చంద్రకాంత్‌ల సెల్‌ఫోన్‌లు స్విచ్‌ఆఫ్‌ అయిపోయాయి. దీంతో పోలీసులకు వీరి ఆచూకీ కనిపెట్టడం సవాలుగా మారింది. ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని విచారించి కేసు పురోగతి సాధించడానికి పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. 

మరిన్ని వార్తలు