అతివేగానికి ఐదు ప్రాణాలు బలి

4 Nov, 2019 04:38 IST|Sakshi
గరికపాడు వద్ద ప్రమాదానికి గురైన కార్లు

కృష్ణా జిల్లా గరికపాడు ఆర్టీఐ చెక్‌పోస్టు వద్ద డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టిన కారు 

మరో కారు వచ్చి ఢీకొట్టడంతో తీవ్ర ప్రమాదం 

మృతులంతా హైదరాబాద్‌ వాసులు   

దుర్గమ్మ దర్శనం కోసం వస్తుండగా విషాదం

జగ్గయ్యపేట(కృష్ణాజిల్లా) : నిద్రమత్తు, అతివేగం ఐదు ప్రాణాలను బలితీసుకున్నాయి. సెలవు రోజు దర్గమ్మను దర్శించుకుందామని హైదరాబాద్‌ నుంచి విజయవాడకు బయలుదేరిన వారు కారు ప్రమాదంలో అనంతలోకాలకు చేరుకున్నారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు గ్రామంలోని 65వ నంబరు జాతీయ రహదారిపై ఆర్టీఐ చెక్‌పోస్టు వద్ద ఆదివారం ఉదయం జరిగిన ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌కు చెందిన షేక్‌ మున్సూర్‌ (24), మహబూబ్‌నగర్‌కు చెందిన మఠంపల్లి భీమిరెడ్డి (27), హైదరాబాద్‌ పటేల్‌నగర్‌కు చెందిన విక్రం కోటేశ్వరరావు (24), కర్ణాటకలోని ఖేదంగోల్కొండకు చెందిన పోతుల భీమిరెడ్డి (25) స్నేహితులు. కర్ణాటకకు చెందిన పోతుల భీమిరెడ్డి కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇందులో ఇద్దరు ఏసీ మెకానిక్‌లు కాగా ఒకరు బైక్‌ మెకానిక్, మరొకరు ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నారు. వీరంతా ఆదివారం సెలవు దినం కావటంతో దుర్గమ్మ దర్శనానికి విజయవాడకు బయలుదేరారు.

శనివారం అర్థరాత్రి అదే ప్రాంతానికి చెందిన కారును అద్దెకు తీసుకుని డ్రైవర్‌ సహా ఐదుగురు బయలుదేరారు. మార్గమధ్యంలో ఆపుకుంటూ సెల్ఫీలు దిగుతూ ఆడుతూ పాడుతూ ప్రయాణిస్తున్నారు. ఆర్టీఐ చెక్‌పోస్టు సమీపంలోని విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్దకు వచ్చే సరికి కారు వేగంగా వెళ్తూ ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొట్టి 10 అడుగుల ఎత్తు ఉన్న మొక్కలను చీల్చుకుంటూ వెళ్లి రోడ్డుపై పల్టీలు కొట్టి ఆగింది. అదే సమయంలో జగ్గయ్యపేట నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న మరో కారు వేగంగా వచ్చి దీన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో ఖమ్మం జిల్లా నాగులవంచకు  చెందిన డ్రైవర్‌ నారపోగు గోపయ్య (22), పక్కనే కూర్చున్న షేక్‌ మున్సూర్‌లు అక్కడికక్కడే మృతి చెందారు.

వెనుక సీట్లో కూర్చున్న పోతుల భీమిరెడ్డి, మఠంపల్లి భీమిరెడ్డి, విక్రం కోటేశ్వరరావును జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు భీమిరెడ్డిలు మార్గమధ్యంలో మృతి చెందగా విజయవాడ ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోటేశ్వరరావు మృతి చెందాడు.  అతి వేగం, నిద్రమత్తు ప్రమాదానికి కారణమని నందిగామ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు