19 Dec, 2017 18:18 IST|Sakshi

గురుగావ్‌ : విమాన సహాయకురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన హర్యానాలోని గుర్‌గావ్‌లో చోటుచేసుకుంది.  గుర్‌గావ్‌లోని విలాసవంతమైన డీఎల్‌ఎఫ్‌ ప్రాంతంలో ఉన్న ఓ గెస్ట్‌హౌస్‌లో ట్రెయినీ ఫ్లయిట్‌ అటెండెంట్‌పై రిసెప్షనిస్ట్‌ శివకుమార్‌ (24) లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.  ఉత్తరప్రదేశ్‌ మెయిన్‌పూరికి చెందిన అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం రిసెప్షనిస్ట్‌ శివకుమార్‌ ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు గెస్ట్‌హౌస్‌లోని 22 ఏళ్ల బాధితురాలి రూమ్‌లోకి చొరబడ్డాడు. సేవలు ఎలా అందుతున్నాయని ఆమెను అడిగాడు. బాత్రూమ్‌లో ట్యాబ్‌ రావడం లేదని చెప్పడంతో చూపించమంటూ కోరాడు. ఇద్దరు బాత్రూమ్‌లోకి వెళ్లగా.. అతడు వెకిలిబుద్ధి చాటుకొని.. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో పారిపోయేందుకు ప్రయత్నించగా.. గెస్ట్‌హౌస్‌లో ఉన్న ఇతర వ్యక్తులు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. డీఎల్‌ఎఫ్‌ ఫేజ్‌-2 పోలీసు స్టేషన్‌లో అతనిపై కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు